Nitish Kumar Angry in Assembly:
వేలు చూపిస్తూ...అరుస్తూ..
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. మొత్తం సభలోని సభ్యులందరినీ తన వైపు తిప్పుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. "ఒకప్పటి నితీష్‌ను మళ్లీ చూశాం" అంటున్నారు కొందరు నేతలు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇటీవలే బిహార్‌లోని ఛప్రాలో కల్తీ లిక్కర్ తాగి 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై బీజేపీ సభలో పదేపదే వాదనకు దిగింది. ఇదే కంటిన్యూ అవుతుండటం వల్ల నితీష్ కుమార్ సహనం కోల్పోయారు. ఉన్నట్టుండి సీట్‌లో నుంచి లేచి మైక్ అందుకుని గట్టిగా మాట్లాడారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కళ్లురుముతూ బీజేపీ నేతలకు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు "అరవకండి" అంటూ నినదించినా...నితీష్ కుమార్ అస్సలు ఆగలేదు. "మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా మద్దతిచ్చారు కదా. అందుకు మీరే సాక్ష్యం కదా. మరి ఇప్పుడు ఇలా రివర్స్‌లో మాట్లాడటమేంటి..? అప్పుడు అంగీకరించిన వాళ్లంతా ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు. ఇంకా లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఎలా ఆరోపిస్తున్నారు..? చెత్త రాజకీయాలు చేయకండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోండి" అని విరుచుకుపడ్డారు. దీనిపై..బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత తారాకిషోర్ ప్రసాద్ స్పందించారు. "మద్య నిషేధానికి మేం సపోర్ట్ చేశాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేం ఆ బిల్లుకి మద్దతునిచ్చాం. కానీ...ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది" అని విమర్శించారు.
మద్యపాన నిషేధం..
బిహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. అయితే దీన్ని కఠినతరం చేసేందుకు బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022కు సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్ చేసి బెయిల్ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అమలు చేస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. అందుకు తగినట్లుగానే కఠిన చర్యలు చేపట్టారు. అయితే మద్యపాన నిషేధం వల్ల చాలా మంది కల్తీ సారాకు అలవాటైపోయి.. చనిపోతున్నారు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. కానీ నితీశ్ మాత్రం మద్యపాన నిషేధంపై మరింత కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 'జోడో యాత్ర'లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్