Gay Marriage Law: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్)పై ఆయన సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.
అంతకుముందు
స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా ముందుగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార డెమోక్రాట్ పార్టీతోపాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో బిల్లు సెనేట్‌లో సులువుగా పాసైంది.
కాంగ్రెస్ ఆమోదం
సెనేట్‍లో ఆమోదం పొందిన స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభకు చేరింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం సభ్యులు, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 169 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. దీంతో అక్కడ కూడా ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది.
ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత బిల్లును సంతకం కోసం అధ్యక్షుడు బైడెన్ దగ్గరికి పంపించారు. తాజాగా ఆయన సంతకం కూడా పూర్తవడంతో సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యాక్ట్ కార్యరూపంలోకి వచ్చినట్లయ్యింది.
Also Read: US On India-China Clash: 'భారత్‌కే మా సపోర్ట్'- సరిహద్దు ఘర్షణపై అమెరికా రియాక్షన్