ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూశారు. బుధవారం ఉదయం అనారోగ్యంతో ఆయన చనిపోయారు. తెలుగులో సింహాసనం, గ్యాంగ్ లీడర్, స్టేట్ రౌడీ తెలుగు సినిమాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. ప్రస్తుతం బప్పి లహిరి వయసు 69 ఏళ్లు. ఈయన గత ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన బప్పిలహిరి జుహూలోని తన స్వగృహంలో వీల్ ఛైర్‌‌కే పరిమితం అయ్యారు. బప్పి లహిరి గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖ నటీనటులు సంతాపం తెలిపారు.






 



తెలుగులో తొలి సినిమా ఇదే.. సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన, స్వయంగా నిర్మించిన సినిమా 'సింహాసనం'. సంగీత దర్శకుడిగా బప్పీ లహరికి తెలుగులో అదే తొలి సినిమా. అందులోని 'ఆకాశంలో ఒక తార...' పాట ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూ ఉంటుంది. 'సింహాసనం' సినిమాను తెలుగుతో పాటు హిందీలో 'సింఘాసన్' పేరుతో తీశారు కృష్ణ. అప్పటికే హిందీలో బప్పీ లహరి ఫేమస్. 'డిస్కో రాజా' సాంగ్స్ ఒక ఊపు ఊపేశాయి. ఆయన అయితే సినిమాకు ప్లస్ అవుతుందని తీసుకున్నారు. నిజంగానే ప్లస్ అయ్యారు.


'సింహాసనం' తర్వాత కృష్ణ నటించిన 'తేనే మనసులు', 'శంఖారావం' సినిమాలకూ బప్పీ లహరి సంగీతం అందించారు. చిరంజీవి 'స్టేట్ రౌడీ', 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', బాలకృష్ణ 'రౌడీ ఇన్స్పెక్టర్', 'నిప్పు రవ్వ', మోహన్ బాబు 'రౌడీ గారి పెళ్ళాం', 'పుణ్యభూమి నా దేశం' సినిమాలకు సంగీతం అందించారు. 'నిప్పు రవ్వ' నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. 'పాండవులు పాండవులు తుమ్మెద'లో 'చూశాలే... చూశాలే...' పాటకు బప్పీ లహరి సంగీతం అందించారు.


సంగీత దర్శకుడిగా తెలుగులో బప్పీ లహరి చివరి సినిమా అంటే 'పాండవులు పాండవులు తుమ్మెద' అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ 'డిస్కో రాజా'లో 'రమ్ పమ్ రమ్...' పాటను ఆలపించారు. గాయకుడిగా ఆయన చివరి తెలుగు పాట అదే. రవితేజ కూడా ఆ పాటలో కొన్ని లైన్స్ పాడారు. ఆ మధ్య బప్పీ లహరి సంగీతంలో చదలవాడ శ్రీనివాసరావు ఓ సినిమా చేయనున్నట్టు దర్శకుడు జి. రవికుమార్ ప్రకటించారు. అయితే... ఆ సినిమా ప్రారంభం కాలేదు. మ్యూజిక్ సిట్టింగ్స్ చేశారో? లేదో? మరి!