2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు గురువారం (ఆగస్టు 24) ఢిల్లీలో వెల్లడించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని ఘనత సాధించిన బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు చెప్పారు. ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ ఘనంగా సన్మానించారు. అద్భుతమైన సందర్భంగా మర్చిపోలేని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు బన్నీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అభినందనలు చెప్పారు.
బన్నీకి ఉత్తమ నటుడి అవార్డు దక్కడం అనుపమ్ కు నచ్చలేదా?
మరోవైపు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని భావించి భంగపడ్డ నటులు నిరాశలో మునిగిపోయారు. తనకు ఉత్తమ నటుడి అవార్డు రాకపోవడం పట్ల బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ 'ది కాశ్మీర్ ఫైల్స్'లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాశ్మీర్ పండిట్ గా పాత్రలో ఒదిగిపోయిన నటించారు. చుట్టూ అల్లరి మూకలు విజృంభిస్తున్న వేళ ప్రాణభయంతో పారిపోయే శరణార్ధిగా నటించారు. ఈ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పడం బాగుంటుంది. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా వచ్చిన అద్భుత స్పందన నేపథ్యంలో తప్పకుండా తనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఆయన భావించారు. కానీ, చివరకు ఆ అవార్డు అల్లు అర్జున్ ను వరించింది.
నాక్కూడా అవార్డు వస్తే బాగుండేది- అనుపమ్ ఖేర్
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం విభాగంలో అవార్డు దక్కించుకుంది. అటు ఉత్తమ సహాయనటిగా ఈ చిత్రంలో నటించిన పల్లవి జోషి అవార్డుకు ఎంపిక అయ్యింది. అవార్డుల ప్రకటన తర్వాత అనుపమ్ ఖేర్ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి రెండు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. “ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. నటుడిగానే కాకుండా సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా నేను వ్యవహరించారు. మా సినిమాకు ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. నా నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ప్రతి విజేతకు నా హృదయపూర్వక అభినందనలు! జై హో!” అని ట్వీట్ చేశారు. అయితే, అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అనుపమ్ ఖేర్ కు ఇష్టం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: వరలక్ష్మీ వ్రతంపై చిల్లర కామెంట్స్, చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial