దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లు వసూళ్లు చేసి వారెవ్వా అనిపించింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను దక్కించుకోవడంలోనై దుమ్మురేపింది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకుంది.  ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకు ముందే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సైతం అందుకుంది.


‘నాటు నాటు’ పాటకు అమెరికా పోలీసుల స్టెప్పులు


‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘నాటు నాటు’ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, రీళ్లు ఇంటర్నెట్‌ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అమెరికా పోలీసులు ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో స్థిరపడిన కొంత మంది ప్రవాస భారతీయులు హోలీ ఆడుతుండగా, ఇద్దరు పోలీసులు వారితో కలిసి హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. సదరు పోలీసులకు మధ్యలో నిలబడిన భారతీయ వ్యక్తి పోలీసులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ప్రజల కేరింతల నడుమ వారు చక్కటి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. 






ప్రతీ చోటా ‘నాటు నాటు’  


“కాలిఫోర్నియా పోలీసులు ‘‘నాటు నాటు’’ పాటకు ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘నాటు నాటు.. ప్రతి చోటా ఉంది” అంటూ నేనావత్ జగన్ అనే నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఇప్పటికి ఈ వీడియో 5.7 లక్షల వ్యూస్ పొందింది.  5,687 లైక్‌లు, ఎన్నో కామెంట్స్ దక్కించుకుంది. ఇక ఈ పాటకు పోలీసులు డ్యాన్స్ చేయడం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.






అద్భుత కొరియోగ్రఫీకి నిలువెత్తు నిదర్శనం


‘నాటు నాటు’ పాటలో పదాలు చాలా తక్కువ. ఎక్కువ భాగం డ్యాన్స్ తోనే నిండిపోయింది. అద్భుత కొరియోగ్రఫీకి ఈ పాట నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డ్యాన్స్ అంటే కేవలం కాళ్లు, చేతులు కదిలించడం మాత్రమే కాదు, అణువణువు స్టెప్స్ వేస్తుంది అనడానికి ఈ పాట ఉదాహరణ. ఒంటిని మెరుపులా కదిలిస్తూ, ప్రేక్షకుల కంటికి ఇంపుగా కనిపించేలా చేశారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఈ పాటలతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.  


Read Also: ‘ఆర్ఆర్ఆర్’ సౌత్ సినిమా కాదా? ‘ఆస్కార్’ క్రెడిట్‌పై రాజ్యసభలో చర్చ - జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు