95వ అకాడమీ అవార్డులలో సౌత్ ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. అటు తమిళ నాడు కేంద్రంగా తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంగాలో ఆస్కార్ పొందింది. అయితే, ఈ రెండు అవార్డులు సౌత్ ఇండియాకు రావడాన్ని రాజ్యసభలో అన్నాడీఎంకే, ఎండీఎంకే నేతలు ప్రస్తావించారు. సౌత్ ఇండియన్ సినిమా స్థాయి ఈ అవార్డులతో ప్రపంచవ్యాప్తం అయ్యిందని చెప్పుకొచ్చారు.
నార్త్, సౌత్ కాదు, వారంతా భారతీయులు!
‘ఆర్ఆర్ఆర్’ మూవీ క్రెడిట్ సౌత్, నార్త్ చర్చపై రాజ్యసభ సభ్యురాలు, నటి జయా బచ్చన్ ఘాటు రిప్లై ఇచ్చారు. కళాకారుల విషయంలో కుల,మత, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పారు. అవార్డు అందుకున్న వాళ్తు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు చెందిన వారు అనేది విషయం కాదన్నారు. వాళ్లంతా భారతీయులని గురించాలన్నారు. “ అవార్డు అందుకున్న వాళ్లు ఏప్రాంతానికి చెందిన వారు అనేది ముఖ్యం కాదు. వాళ్లంతా భారతీయులు. మన దేశం తరఫున ఎన్నో సార్లు ప్రాతినిధ్యం వహించి, ఎన్నో అవార్డులు అందుకున్న సినీ సోదరుల పట్ల గౌరవంతో, గర్వంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. సినిమా మార్కెట్ ఇక్కడే ఉంది. అమెరికాలో లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ప్రతిభను ఇప్పుడిప్పుడే ప్రాశ్చాత్య దేశాలు గుర్తిస్తున్నాయి” అని జయ వెల్లడించారు.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ అందుకున్న తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు సౌత్, నార్త్ ఇండియా అనే చర్చను ముందుకు తెచ్చారు. అది మంచిది కాదు. 1992లో ఆస్కార్ గెలిచిన సత్యజిత్ రే, ఎన్నోసార్లు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. గొప్ప అవార్డులను పొందారు. సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు. ఎస్ఎస్ రాజమౌళి నాకు బాగా తెలుసు. రచయిత విజయేంద్ర ప్రసాద్ కేవలం స్క్రిప్ట్ రైటర్ మాత్రమే కాదు, కథా రచయిత కూడా. అతడు ఈ సభలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది గొప్ప గౌరవం. సృజనాత్మక ప్రపంచం నుంచి ఇంతకు ముందు, ఇప్పుడు కూడా పెద్దలకు సభకు నామినేట్ చేయబడిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు” అని జయ తెలిపారు.
భారత్ కు రెండు ఆస్కార్ అవార్డులు
మార్చి 12న జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ లో తెలుగు సినిమా ‘RRR’ సత్తా చాటింది. ఉత్తమ పాటగా ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కింది. అటు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వ్స్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను ఆస్కార్ వరించింది. SS రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘RRR’కు MM కీరవాణి సంగీతం అందించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల హీరోలుగా నటించారు.
Read Also: ‘నాటు నాటు’ స్టెప్పులు వెయ్యాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ మలయాళ పత్రిక చూస్తే సరిపోతుంది!