‘RRR’ సినిమా ప్రపంచ సినీ వేదికపై సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ప్రస్తుతం ప్రపంచం అంతా ‘నాటు’ స్టెప్పులతో దుమ్మురేపుతోంది. తన కొడుకు నటించిన సినిమాకు ఆస్కార్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం పట్టలేకపోతున్నారు. చెర్రీ సాధించిన ఘనతకు ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఆస్కార్ అవార్డు తనకే వచ్చినట్లు ఫీలవుతున్నారు.

  


డీపీ మార్చిన చిరంజీవి, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు


చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ డీపీని మార్చారు. ఆస్కార్ అవార్డుతో కూడిన డీపీని పెట్టారు. ఆయన డీపీని మార్చడం పట్ల పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఎడిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆస్కార్ విజయాన్ని కేవలం తన కొడుకు రామ్ చరణ్ కు మాత్రమే ఆపాదించే ప్రయత్నం చేయడంపై నెటిజన్లు ఓ రేంజిలో విమర్శలు చేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో చిరంజీవి వివరణ ఇస్తూ ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘RRR’ సినిమా దర్శక నిర్మాతలకు, పాట పాడిన సింగర్లు, కంపోజ్ చేసిన మాస్టర్, కీరవాణి, హీరోలకు  శుభాకాంక్షలు చెప్పారు.  


సోషల్ మీడియా ట్రోలింగ్ పై చిరు అభిమానుల ఆగ్రహం


గత కొంతకాలంగా చిరంజీవి ఏదో ఒక కామెంట్ చేయడం, నెటిజన్లతో ట్రోలింగ్ కు గురికావడం కామన్ గా కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లో రవితేజను చిన్న హీరో అని సంబోధించి తీవ్ర విమర్శలపాలయ్యారు. అటు మరికొంత మంది చిరంజీవి అభిమానులు మాత్రం ఇందులో తప్పేముంది అంటున్నారు.  మనకు ఆస్కార్ వచ్చిందనే సంతోషాన్ని వెల్లడించేందుకు ఆస్కార్ తో కూడిన డీపీ పెట్టి ఉంటారని సమర్థిస్తున్నారు. దీనికి కూడా ట్రోల్ చేయాలా? అంటూ మండిపడుతున్నారు.  






డీపీ మార్చుకున్న చంద్రబోస్, నెటిజన్ల అభినందనలు


అటు ‘RRR’ ‘నాటు నాటు’ పాట రాసిని చంద్రబోస్ సైతం తన సోషల్ మీడియా డీపీ మార్చుకున్నారు. ఆస్కార్ అందుకున్న సందర్భంగా తీసిన ఫోటోను పెట్టుకున్నారు. చేతిలో బంగారు ఆస్కార్ తో చిరు నవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. పలువురు నెటిజన్లు ఈ ఫోటోకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ అభినందనలు కురిపిస్తున్నారు.


Read Also: ‘నాటు నాటు’ స్టెప్పులు వెయ్యాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ మలయాళ పత్రిక చూస్తే సరిపోతుంది!