ప్రపంచ ప్రఖ్యాత ‘ఆస్కార్’ అవార్డును కొల్లగొట్టిన ‘RRR’ ‘నాటు నాటు’ పాటకు ప్రపంచం మాస్ స్టెప్పులు వేస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు దునియాను ఊపేస్తోంది. ఈ నాటు స్టెప్పులకు అన్ని భాషల ప్రేక్షకులు ఇట్టే ఫిదా అయ్యారు. అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకోవడంతో ఈ పాట ప్రపంచ సినీ అభిమానులకు మరింత చేరువయ్యింది.


ఇప్పటికే ఈ ‘నాటు నాటు’ పాటకు చాలా మంది అచ్చం ఎన్టీఆర్, రామ్ చరణ్ మాదిరిగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరికొంత మంది వారిలా వేగంగా స్టెప్పులు వేయలేక నానా తిప్పలు పడుతున్నారు. ఈ పాటకు సంబంధించి కొరియోగ్రాఫర్ గా పని చేసిన ప్రేమ్ రక్షిత్, ఎలా స్టెప్పులు వేయాలో ఓ వీడియో ద్వారా చూపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పాటలోని హుక్ స్టెప్ గురించి వివరించారు.   


‘నాటు నాటు’ స్టెప్పులు వేయండిలా!


తాజాగా ఈ పాటకు సంబంధించి మలయాళ పత్రిక ‘మలయాళీ మనోరమ’ డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో పూర్తి వివరాలతో ఓ వార్త ప్రచురించింది. ఈ పాటను షూట్ చేయడానికి మూడు భాగాలుగా విభజించినట్లు అందులో  వివరించింది. హుక్ స్టెప్స్ లో కాళ్లను ముందుకు, వెనక్కి ఎలా కదిలించాలి? తలను అటు ఇటు ఎలా తిప్పాలి? ఒక్క సెకెన్ లో ఎన్ని స్టెప్పులు వేయాలి? అనే పూర్తి వివరాలతో ప్రతి స్టెప్పుకు ఓ స్కెచ్ వేసి చూపించింది. ఈ కథనంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు హుక్ స్టెప్ చేస్తున్న క్యారికేచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మలయాళీ పత్రిక క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక దేశంలోని జాతీయ పత్రికలు ఈ పాటను హైలెట్ చేస్తూ అద్భుత విశ్లేషణలు చేస్తుంటే, స్థానిక మీడియాకు ఎందుకు పట్టడం లేదంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలయాళీ పత్రిక క్లిప్ షేర్ చేశాడు.   






అద్భుత కొరియోగ్రఫీకి నిలువెత్తు నిదర్శనం


ఇక ఈ పాటలో పదాలు చాల తక్కువ. ఎక్కువ భాగం డ్యాన్స్ తోనే నిండిపోయింది. అద్భుత కొరియోగ్రఫీకి ఈ పాట నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డ్యాన్స్ అంటే కేవలం కాళ్లు, చేతులు కదిలించడం మాత్రమే కాదు, అణువణువు స్టెప్స్ వేస్తుంది అనడానికి ఈ పాట ఉదాహరణ. ఒంటిని మెరుపులా కదిలిస్తూ, ప్రేక్షకుల కంటికి ఇంపుగా కనిపించేలా చేశారు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఈ పాటలతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకుని తెలుగు సినిమా సత్తా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అత్యున్నత పురస్కారం అందుకున్న తర్వాత, నాటు నాటు క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.  అంతకు ముందు, ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకుంది.


Read Also: ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!