'రాధే శ్యామ్' అండ్ 'ఈటి'... థియేటర్లలో ఈ వారం విడుదలవుతున్న పెద్ద సినిమాలు రెండు అనే చెప్పాలి. ఓటీటీల్లో మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన 'రౌడీ బాయ్స్', 'ఖిలాడి' ఓటీటీ విడుదలకు రెడీ అవ్వగా... 'మారన్', 'క్లాప్' తదితర సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అసలు ఈ వారం థియేటర్ / ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఏవో ఒకసారి చూస్తే... 


'రాధే శ్యామ్'
ప్రభాస్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన 'రాధే శ్యామ్'లో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో నటించారు. అంటే... చెయ్యి చూసి జాతకం ఏంటో చెప్పేస్తారు. అతడి జీవితంలో ప్రేమ, పెళ్లి విషయంలో ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. తెలుగు సహా దక్షిణాది భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కీలక పాత్ర చేశారు. యూరోప్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతోంది.



'ఈటి'
తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా 'ఈటి'. ఎవరికీ తలవంచడు... అనేది ఉపశీర్షిక. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్'... కరోనా కారణంగా ఆయన నటించిన రెండు సినిమాలు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత థియేటర్లలోకి వస్తున్న సూర్య చిత్రమిది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో సూర్య సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. డి. ఇమాన్ సంగీతం అందించారు. మార్చి 10న... గురువారమే సినిమా విడుదలవుతోంది. 'రాధే శ్యామ్' కంటే ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వస్తుండటంతో తెలుగునాట గురువారం సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. 



మారన్
'జగమే తంత్రం', 'అతరంగి రే'... ధనుష్ లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. ఆయన నటించిన 'మారన్' కూడా ఓటీటీలో వస్తోంది. ఇందులో మాళవికా మోహనన్ హీరోయిన్. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలో సముద్రఖని, మహేంద్రన్, స్మృతి తదితరులు నటించారు. 'మారన్'లో ధనుష్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రోల్ చేశారు. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మార్చి 11న సినిమా విడుదలకు రెడీ అయ్యింది.



క్లాప్
ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'క్లాప్'. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ట్రైలర్ చూస్తే... రెగ్యులర్ స్పోర్ట్స్ సినిమాలకు కాస్త డిఫ‌రెంట్‌గా తెరకెక్కించినట్టు ఉంది. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం ఎలా జరుగుతుందనేది కాన్సెప్ట్ అయినా... ఓ కాలు కోల్పోయిన క్రీడాకారుడిగా ఆది పినిశెట్టి కనిపించడం సినిమాపై ఆసక్తి పెంచింది. పృథ్వీ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. సోనీ లివ్ ఓటీటీలో మార్చి 11న ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ అవుతోంది.



సన్నీ లియోన్ 'అనామికా'
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'అనామికా'. ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో మార్చి 10న విడుదల కానుంది. హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స‌బ్‌స్క్రిప్ష‌న్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. ఎంఎక్స్ ప్లేయర్‌లో అన్ని ఎపిసోడ్స్ ఫ్రీగా చూడవచ్చు.



కుబూల్ హై?
ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న మరో ఒరిజినల్ సిరీస్ 'కుబూల్ హై?'. తెలుగు ప్రేక్షకులకు ముందుకు 'ఆహా' ఓటీటీ తీసుకు వస్తోంది. పాతబస్తీలో బాలికలను దుబాయ్ షేక్ లు పెళ్లి చేసుకోవడంతో పాటు చాలా అంశాలను టచ్ చేస్తూ 'కుబూల్ హై' తీసినట్టు ఉన్నారు. ప్రణవ్ రెడ్డి నిర్మించడంతో పాటు ఉమైర్ హాసన్, ఫైజ్ రైతో కలిసి దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్, డ్రామా జానర్ లో రూపొందిన ఈ సిరీస్ మార్చి 11 నుంచి 'ఆహా' ఓటీటీలో ప్రీమియర్ కానుంది.



'దిల్' రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన అబ్బాయి ఆశిష్. ఈయన శిరీష్ కుమారుడు. 'రౌడీ బాయ్స్'తో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా మార్చి 11న 'జీ 5' ఓటీటీలో విడుదల అవుతోంది. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి' కూడా ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఆ సినిమాను మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ విడుదల చేస్తోంది. వీటితో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలు కూడా ఈ వారం విడుదల అవుతున్నాయి.