ఎదురు లేదు... ఎవరూ ఎదురు రావాలని కూడా అనుకోవడం లేదు... థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఎదురు వచ్చే సినిమా ఏదీ లేదు. తెలుగులో మాత్రమే కాదు... తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ వారం థియేటర్లలో భారీ  సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆ మాటకు వస్తే... ఒక మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఏవీ విడుదల కావడం లేదు. మలయాళంలో మాత్రమే ఓ చిన్న 'సౌదీ వెళ్ళక్క' విడుదలకు సిద్ధమైనట్టు తెలిసింది. మిగతా భాషల్లో 'ఆర్ఆర్ఆర్'కు దారిస్తూ... లైన్ క్లియర్ చేశాయి. అటు ఓటీటీల్లో కూడా ఈ వారం తెలుగు నుంచి కొత్త సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన సినిమాలు సందడి చేయనున్నాయి. అసలు, ఈ వారం థియేటర్ / ఓటీటీ వేదికల్లో విడుదల అవుతున్న సినిమాలు ఏవి? అని ఓ లుక్కేస్తే...


'ఆర్ఆర్ఆర్'
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా! ఎప్పటి నుంచో సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న సినిమా! ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మార్చి 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ - మన దేశంలో ఈ ఐదు భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రమిది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కథ ఊహాజనిత కథతో తీశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. తెలుగులో అయితే ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదొక్కటే! హిందీ, కన్నడ, తమిళంలో కూడా!


'భీమ్లా నాయక్'
థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి చేయడానికి సిద్ధమైతే... ఓటీటీల్లో 'భీమ్లా నాయక్' సందడి చేయనుంది. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా... రెండు ఓటీటీ వేదికలు - డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహాలో మార్చి 25న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన చిత్రమిది. ఓటీటీ విడుదల కోసం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. రెండు ఓటీటీ వేదికలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా ట్రైలర్స్ కట్ చేయడం నుంచి సోషల్ మీడియాలో ఒక రేంజ్ పబ్లిసిటీ చేస్తున్నాయి.
Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?


'వలిమై'
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సైతం ఓటీటీలో ఈ వారమే విడుదల అవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 25 నుంచి 'జీ 5' ఓటీటీ అందుబాటులోకి రానుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: 'వలిమై' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?


'83'
కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా 83 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆ చిరస్మరణీయ విజయాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన సినిమా '83'. కపిల్ దేవ్ పాత్రలో ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించారు. మార్చి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికల్లో ఈ సినిమా వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హిందీ సహా దక్షిణాది భాషల్లో సినిమాను చూడొచ్చు.
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?


ఇంకా మార్చి 25న థియేటర్లలో మలయాళ సినిమా 'సౌదీ వెళ్ళక్క'... మార్చి 24న వూట్ ఓటీటీలో హాలీవుడ్ సినిమా 'హలొ' విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో, ఐట్యూన్స్, గూగుల్ ప్లే, యూట్యూబ్, హంగామాలో హాలీవుడ్ సినిమా 'డ్యూన్' విడుదల కానుంది. అమెరికాలో గత ఏడాది ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు డిజిటల్ వేదికల్లో విడుదలకు సిద్ధమైంది. ఇంగ్లీష్‌లో మాత్రమే కాదు... హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను చూడొచ్చు.


బెంగాలీ సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులు మార్చి 27న హోయ్‌చోయ్‌ ఓటీటీ వేదికలో 'బాబా, బేబీ ఓ...' సినిమాను చూడొచ్చు. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్, 'భీష్మ', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాల్లో నటించిన జిష్షు సేన్ గుప్తా ఇందులో హీరో.