Suma Rajiv Kanakala Wedding Anniversary: బుల్లితెరపై లేడీ యాంకర్ అంటే సుమ. తనకు పోటీగా ఇంకా ఏ యాంకర్ లేదని ప్రేక్షకులు అంటుంటారు. అలాంటి సుమ కెరీర్ పెళ్లయిన తర్వాతే ప్రారంభమయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలిగా సెటిల్ అయిపోయింది సుమ. తాజాగా తన 25వ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఇక 25వ పెళ్లిరోజు సందర్భంగా తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి సమయాన్ని ఎలా గడిపిందో తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో చూపించింది. ముందుగా తమ కొడుకు, కూతురు కలిసి సుమ, రాజీవ్‌ల పెళ్లి ఆల్బమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ పెళ్లి ఫోటోలను చూసుకుంటూ వారు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ఇన్నేళ్ల వారి వైవాహిక జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తకర సంఘటనలను బయటపెట్టింది సుమ.
‘పెళ్లి పుస్తకం’లోని పాట..
ముందుగా వారి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కు వెళ్లారు సుమ, రాజీవ్. ఆ తర్వాత తన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారని ఒక ఫన్నీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది సుమ. ముందుగా వారి పెళ్లి ఎలా జరిగిందో గుర్తుచేసుకున్నారు. పెళ్లి మొత్తం ఎక్కువగా తెలుగు సాంప్రదాయంలోనే జరిగినా.. కేరళకు సంబంధించిన కొన్ని ఆచారాలను గుర్తుచేశారు రాజీవ్. ఇక పెళ్లిలో ఆచారం ప్రకారం నాలుగో ముడి ఆడపడచు వేయాలని, కానీ కష్టపడి ప్రేమించాను కాబట్టి నాలుగో ముడి కూడా నేనే వేస్తానని రాజీవ్ గొడవ చేసి మరీ నాలుగో ముడి వేశారని బయటపెట్టింది సుమ. పైగా పెళ్లి జరుగుతున్నంత సేపు ‘పెళ్లి పుస్తకం’ నుండి అమ్మకుట్టి అనే పాట ప్లే అవుతూనే ఉందని గుర్తుచేసుకున్నారు.
పార్ట్‌నర్‌కు టైమ్ ఇవ్వండి..
హ్యాపీ మ్యారేజ్‌కు సీక్రెట్ ఏంటో కనిపెట్టడం చాలా కష్టమని చెప్పింది సుమ. వారిద్దరిలో బెటర్‌గా వండేది ఎవరు అని అడగగా.. సుమనే అని చెప్పారు రాజీవ్. ఆ తర్వాత తన వంటల్లో ఏమేం ఇష్టమో బయటపెట్టాడు. తర్వాత వారిద్దరికీ ఇష్టమైన ‘ప్రియతమా నీవచట కుశలమా’ పాటను కలిసి పాడారు. ‘‘ఇక పెళ్లయిన కొత్తలో పార్ట్‌నర్‌కు చాలా టైమ్ ఇవ్వండి. తర్వాత ఎలాగో అవసరం లేదు. కానీ మొదట్లో మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకొని అమ్మాయి మీతో పాటు జీవించడానికి వస్తుంది. సడెన్‌గా మీ స్నేహితులు, సరదాలను కూడా పక్కన పెట్టలేరు కానీ కొత్తలో మాత్రం మీ టైమ్ ఇవ్వండి లేకపోతే వారు ఒంటరిగా ఫీల్ అవుతారు. వాళ్లు రివెంజ్ తీసుకోవడం మొదలుపెడితే చాలా కష్టం’’ అని సలహా ఇచ్చారు రాజీవ్ కనకాల. రాజీవ్ చెప్పిన సలహాకు సుమ కూడా ఒప్పుకుంది.
ఇప్పటికీ ఆ విషయంపై గొడవ..
సుమ, రాజీవ్ ఎప్పుడూ యానివర్సరీ లేదా బర్త్‌డేలు మర్చిపోలేదని అన్నారు. అయితే ప్రపోజ్ చేసినరోజు ఎప్పుడు అని రాజీవ్ అడగగా.. ఒక మంచి రోజు అని కౌంటర్ ఇచ్చింది సుమ. 1995 మేలో రాజీవ్ ప్రపోజ్ చేశాడని చెప్పింది. 30 ఏళ్లు ఎలా భరించావో అనగా.. అదే ఇప్పుడు ఆలోచిస్తున్నా అంటూ రాజీవ్ కూడా జోక్ చేశారు. ఏ సినిమాలకు వెళ్లాలి అని ఇప్పటికీ గొడవపడతారని బయటపెట్టింది సుమ. ‘‘పెళ్లయిన మొదట్లో వైరస్, దెయ్యాలు, భూతాలులాంటి సినిమాలకు తీసుకెళ్లేవాడు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను ఇలాంటి సినిమాలు అన్నీ చూపిస్తావేంటి అని గొడవపడ్డాను’’ అని రివీల్ చేసింది. రాజీవ్ 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానని చాలాసార్లు అబద్దం చెప్పాడని సుమ తెలిపింది. పార్ట్‌నర్‌కు తెలియకుండా ఫోన్ చెక్ చేశారా అని అడగగా.. సుమ అవును అనే సమధానిమిచ్చింది. దానికి రాజీవ్ షాకయ్యారు. ఎప్పుడు అని అడగగా.. పదేళ్ల క్రితం అని చెప్పింది.
Also Read: భర్తతో గోవా బ్యూటీ వాలెంటైన్స్ డే వేడుక, నెట్టింట్ట ఫోటో వైరల్!