Karthika Deepam 2 Lady Villain: మొదటిసారి సీరియల్స్‌లో సీక్వెల్స్ అనే ట్రెండ్‌ను తీసుకొస్తోంది ‘కార్తీక దీపం’. ఇప్పటికే ‘కార్తీక దీపం’ అనే సీరియల్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సరిగ్గా ఏడాది తర్వాత దీని సీక్వెల్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు మేకర్స్. ఈ సీరియల్ వల్ల డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్‌కు మంచి గుర్తింపు లభించింది. అందుకే వీరిద్దరి కలిసి ‘కార్తీక దీపం’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఇందులో విలన్‌గా మోనిత పాత్ర వల్ల శోభా శెట్టి కూడా ఫేమ్ సంపాదించుకుంది. కానీ సీక్వెల్‌లో మాత్రం విలన్‌గా తను నటించడం లేదు. తన స్థానంలోకి మరో అమ్మాయి వచ్చింది. 


మోనిత కావాలి..


‘కార్తీక దీపం’లో మోనితగా శోభా శెట్టి పాత్రకు ఎంత గుర్తింపు లభించిందంటే.. తను ఏకంగా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా సెలక్ట్ అయ్యింది. హీరోహీరోయిన్లుగా నిరుపమ్, ప్రేమికి ఎంత ప్రాధాన్యత ఉండేదో శోభాకు కూడా అంతే ప్రాధాన్యత లభించింది. ఇక ఆ సీరియల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కార్తీక దీపం నవ వసంతం’లో లేడీ విలన్‌గా గాయత్రి సింహాద్రి ఎంపికయ్యింది. ఇప్పటికే పలు సీరియల్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. యాంకర్‌గా కూడా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు ‘కార్తీక దీపం నవ వసంతం’లో నటించే క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. కానీ చాలామంది నెటిజన్లు మాత్రం లేడీ విలన్‌గా మోనితగా ఎవరు సాటి రాలేరంటూ, తమకు మోనితనే కావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.






టెన్షన్‌గా ఉంది..


తాజాగా నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ కలిసి ‘కార్తీక దీపం’ గురించి, నవ వసంతం గురించి మాట్లాడుకుంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో పలు విషయాలపై వారు క్లారిటీ ఇచ్చారు. చాలామంది ప్రేక్షకులు మోనిత, హిమ, శౌర్య పాత్రలు ఉంటాయా అని అడుగుతున్నారని గుర్తుచేసుకున్నారు. ‘‘ఓపెన్ మైండ్‌తో చూస్తే ఈ సీరియల్‌లో కొత్త కథ బాగుంటుంది. వాళ్లేదో అనుకొని, అంచనాలు వేసుకొని చూస్తే ఏమైపోతుందో అని భయం’’ అంటూ తన టెన్షన్‌ను బయటపెట్టాడు నిరుపమ్. ప్రేమి విశ్వనాథ్ మాత్రం.. తమ పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని, తాము కూడా మనసు పెట్టి పనిచేశాం కాబట్టి కచ్చితంగా సీరియల్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది.


భార్యాభర్తలు కాదు..


‘కార్తీక దీపం’కు, దాని సీక్వెల్‌కు అసలు సంబంధం లేదని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రోమో చూస్తుంటే మాత్రం ఇది మొదటి భాగానికి సంబంధించిందే అని కొందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. అలా కాదని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్. ‘కార్తీక దీపం నవ వసంతం’లో వారిద్దరి భార్యాభర్తలు కాదన్నారు. ఇందులో తను డాక్టర్‌గా నటించడం లేదని, బిజినెస్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నానని నిరుపమ్ తెలిపాడు. మొదటి సీజన్ ఆ రేంజ్‌లో సక్సెస్ అయ్యింది కాబట్టి ప్రేక్షకులు చాలా అంచనాలతో ఉంటారని అందుకే తనకు చాలా టెన్షన్‌గా ఉందంటూ నిరుపమ్ చెప్పుకొచ్చాడు.



Also Read: ‘మగధీర’ రీ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ - ట్రైలర్ కూడా వచ్చేసింది చూశారా?