బుల్లితెర వీక్షకులను సీరియల్స్ ద్వారా ఆకట్టుకోవడంలో స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ ముందున్నాయి. ఆ రెండిటితో పోలిస్తే 'ఈ టీవీ' కొంచెం వెనుకబడింది. అయితే, ఈ మధ్య ఈ టీవీ గేరు మార్చింది. మిగతా ఛానళ్లకు పోటీ ఇవ్వడానికి అన్నట్లు కొత్త సీరియళ్లను రంగంలోకి దించుతోంది. అందులో 'ఝాన్సీ' (Jhansi Telugu Serial On ETV) ఒకటి. ఈ సీరియల్ కథ ఏమిటి? ఇందులో నటీనటులు ఎవరు? టెలికాస్ట్ టైమింగ్స్ ఏంటి? వంటి వివరాలు తెలుసుకోండి.
జనవరి 20 నుంచి షురూ... కథ ఏమిటంటే?
ETV Serial Jhansi Telecast Time: జనవరి (ఈ నెల) 20వ తేదీ నుంచి 'ఝాన్సీ' సీరియల్ ప్రారంభం కానున్నట్లు 'ఈ టీవీ' పేర్కొంది. 'ఏ వారియర్' (ఓ యోధురాలు)... అనేది ఉప శీర్షిక. ఆల్రెడీ ప్రోమో కూడా విడుదల చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు... ప్రతి రోజూ రాత్రి ఏడు గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. కొత్త ఏడాది (2025లో) ఈటీవీ ప్రారంభిస్తున్న కొత్త సీరియల్ ఇది.
న్యాయ వ్యవస్థ నేపథ్యంలో 'ఝాన్సీ'ని తెరకెక్కించినట్లు ఆల్రెడీ విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది. టైటిల్ రోల్ ఒక అమ్మాయి పోషిస్తోంది. ఆమె ప్రత్యర్థిగా మరొక మహిళ పాత్రను సృష్టించారు. వాళ్లిద్దరూ న్యాయవాదులే. మరి, వాళ్ల మధ్య గొడవ ఏమిటి? ఏ విషయంలో న్యాయస్థానం ముందు నిలబడ్డారు? వంటివి తెలియాలంటే మరో రెండు వారాలు ఆగక తప్పదు. సమాజంలో మహిళల మీద జరుగుతున్నా అఘాయిత్యాలు, అత్యాచారాలు వంటివి ప్రస్తావించే అవకాశం ఉంది. జనవరి 20న సీరియల్ స్టార్ట్ అవుతుంది కదా!
'ఝాన్సీ' పాత్రలో లిఖితా మూర్తి... హీరో ఎవరు?
Jhansi ETV Serial cast and crew: 'ధర్మ పోరాటంలో న్యాయం కోసం నిలబడితే... చేతిలో ఉన్న గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది' అంటూ ప్రోమో విడుదల చేశారు. అందులో నల్లకోటు వేసుకుని లిఖితా మూర్తి (Likitha Murthy) కనిపించారు. ఇంతకు ముందు 'జీ తెలుగు'లో వచ్చిన 'రాజేశ్వరి విల్లాస్ కాఫీ క్లబ్' సీరియల్ చేసింది ఆవిడ. అందులో రాజేశ్వరి క్యారెక్టర్ చేసింది. 'జెమినీ టీవీ'లో వచ్చిన 'రాఖీ పూర్ణిమ'లో పూర్ణిమగా, 'బంగారు పంజరం'లో మహాలక్ష్మిగా నటించారు.
లిఖితా మూర్తి కాకుండా 'ఝాన్సీ'లో మరో న్యాయవాది మృణాళినిగా జయశ్రీ ఎస్ రాజ్ నటించారు. పోలీస్ గౌతమ్ పాత్రలో మలయాళ నటుడు సానురాజ్ కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో భావనా సామంతుల, విజయ కోట్ల, బాలనటి నందిత నటిస్తున్నారు. ఈ సీరియల్ ఎటువంటి స్పందన అందుకుంటుందో చూడాలి.