'జబర్దస్త్' కామెడీ షో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై అద్భుత ప్రేక్షక ఆదరణ పొందింది. సూపర్ డూపర్ హిట్ తెలుగు టీవీ షోలలో ఒకటిగా నిలిచింది. గత పదేళ్ళుగా విజయవంతంగా ఈ షో ప్రసారం అవుతోంది. 'జబర్దస్త్' షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో ఒకడు 'పంచ్' ప్రసాద్. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.  కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.  ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు.  


పంచ్ ప్రసాద్ కు అండగా ఏపీ సర్కారు


ప్రసాద్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తోటి నటుడు, 'జబర్దస్త్' కమెడియన్ ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.  ''అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను'' అని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు. ఆయన పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ చేశారు ఇమ్మాన్యుయేల్. ఈ పోస్టుపై తాజాగా ఏపీ సర్కారు స్పందించింది. ఆయన చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ హరికృష్ణ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మా టీమ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో చర్చించింది. LOC దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డ్యాక్యుమెంట్స్ ధృవీకరణను పూర్తి చేసిన వెంటనే మూత్రపిండ మార్పిడి కోసం CMRF కింద LOC మంజూరు చేస్తాము” అని ప్రకటించారు.   






అసలు ప్రసాద్ ఆరోగ్య సమస్య ఏమిటి?


కిడ్నీ సమస్యల కారణంగా ప్రసాద్ కు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఓసారి ఆయనకు సీరియస్ అయ్యింది. ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. చిత్రీకరణ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. అప్పుడు ఓ ఆపరేషన్ జరిగింది. ఇందుకు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. పంచ్ ప్రసాద్ నడవలేని నడవలేని స్థితి నుంచి మళ్ళీ కోలుకుని టీవీ షూటింగులు కూడా చేశారు. ఈ మధ్య టీవీ ప్రోగ్రాంలలో ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తోటి ‘జబర్దస్త్’ కమెడియన్స్  సినిమా, టీవీ ఇండస్ట్రీలో తమకు తెలిసిన ప్రముఖుల నుంచి సాయం కోరుతూ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సర్కారు సైతం ప్రసాద్ కు అండగా నిలిచింది.


Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు