BB Utsavam Promo: బిగ్ బాస్ తెలుగులో ఒక సీజన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత ‘బీబీ ఉత్సవం’ అనే పేరుతో కంటెస్టెంట్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అదే విధంగా మరోసారి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా ఒకచోట కలిశారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఒకరితో ఒకరు తాము పంచుకున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో తండ్రిని గుర్తుచేసుకుంటూ నయని పావని ఎమోషనల్ అయ్యి.. తనతో పాటు అందరినీ ఎమోషనల్ చేసేసింది. పల్లవి ప్రశాంత్ సైతం తాను జైలులో ఉన్నప్పుడు తన తండ్రి పరిస్థితి ఏంటో చెప్తూ ఏడ్చేశాడు. అలా మరోసారి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా కష్టసుఖాలు పంచుకున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


ఇప్పటికీ మిస్ అవుతాను..


‘బీబీ ఉత్సవం’లో సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా తమకు నచ్చిన విధంగా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారు. కొందరు డ్యాన్సులు చేశారు, కొందరు పాటలు పాడారు. అదే విధంగా నయని పావని.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ డ్యాన్స్ చేసింది. ‘‘నాన్న ప్రేమకు దూరమయిన నాకు ఒక మంచి మనసున్న మనిషిని నాన్నగా గిఫ్ట్ ఇచ్చాడు’’ అంటూ శివాజీ గురించి చెప్తూ తనను పట్టుకొని ఏడ్చేసింది నయని పావని. ‘‘తను వాళ్ల నాన్నను ఎంత ప్రేమిస్తుందో హౌజ్‌లోకి వచ్చిన రెండోరోజే నేను గమనించాను. తండ్రి లేకపోతే నరకం మా నాన్నకు నేను ఇప్పటికీ కూడా మిస్ అవుతాను’’ అని చెప్తూ శివాజీ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్.. ‘‘గెలిచినప్పుడు నాన్న మొహంలో సంతోషం చూడాలనుకున్నా. కానీ నాన్న కోర్టు బయట పడుకున్న వీడియో చూసినప్పుడు నేనేనా ఇంకా బ్రతికున్నది అని చాలా బాధనిపించింది’’ అని చెప్తూ ఏడ్చేశాడు.


అర్జున్‌కు గౌతమ్ స్పెషల్ గిఫ్ట్..


బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అంతా ఇతర కంటెస్టెంట్స్‌ను ఏదో ఒక రిలేషన్‌తో దగ్గర తీసుకున్నారు. అలా తమకు చాలా క్లోజ్ అయిన వారికి ఈ ‘బీబీ ఉత్సవం’లో గిఫ్ట్స్ ఇచ్చారు కంటెస్టెంట్స్. ముందుగా నాగార్జున.. తనకు గిఫ్ట్ ఇచ్చిన టీ షర్ట్‌ను అమర్‌దీప్‌కు ఇచ్చేసింది శోభా. అది తనకు చాలా విలువైనది అయినా అమర్ అడిగాడు కాబట్టి ఇస్తున్నా అని చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల తనకు అర్జున్ అన్నలాగా దొరికాడంటూ అన్నకు, వదినకు, ఇటీవల వారికి పుట్టిన పాపకు గిఫ్ట్ అని చెప్పి వెండి పట్టీలు ఇచ్చాడు గౌతమ్. అప్పుడే తన పాపు పుట్టినప్పటి క్షణాలను గుర్తుచేసుకున్నాడు అర్జున్. మామూలుగా పుట్టిన వెంటనే పిల్లలు కళ్లు తెరవకుండా ఏడుస్తారని, కానీ తన పాప మాత్రం కళ్లు పెద్దగా తెరిచి ముందుగా తననే చూసిందని గుర్తుచేసుకున్నాడు. 


కలిసిపోయిన రతిక, ప్రశాంత్..


బిగ్ బాస్ వల్ల తమ జీవితంలో జరిగిన మార్పుల గురించి కంటెస్టెంట్స్ చెప్పుకొచ్చారు. ‘‘బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆంధ్రవాళ్లు మొత్తం నన్ను అమ్మ అని పిలుస్తున్నారు’’ అని షకీలా తెలిపింది. ఇక సీజన్ 7లో కెప్టెన్ అవ్వని వారంతా కలిసి ఒక గేమ్ ఆడారు. అందులో అమర్ కూడా పాల్గొన్నాడు. హౌజ్‌లోలాగానే శివాజీ, అర్జున్ మళ్లీ అమర్‌పై జోకులు వేయడం మొదలుపెట్టారు. తేజ నామినేట్ చేసినందుకే తాను ఎలిమినేట్ అయ్యానని తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టింది పూజా. రతిక, పల్లవి ప్రశాంత్ కలిసి చేసిన డ్యాన్స్‌ను ఇతర కంటెస్టెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు. ‘‘ఫినాలే తర్వాత ఇదే కలవడం. టాస్క్‌లో భాగంగా ఏదో అనాల్సి వచ్చింది. అది ఇంకా మనసులో ఉంటే సారీ’’ అని చెప్పింది రతిక. మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లో ఆడిన ఫన్నీ టాస్కులు అన్నీ ఆడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.



Also Read: రామం రాఘవం - తండ్రి మీద కుమారుడికి ఉన్న ప్రేమను చెప్పే కథ