Touching Glimpse of 'Ramam Raghavam' unveiled on Valentine's Day: నటుడిగా ధనరాజ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. పలు సినిమాల్లో తనదైన నటనతో నవ్వించారు. భావోద్వేగానికి గురి చేశారు. ఇప్పుడు ఆయన దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతూ... ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'రామం రాఘవం'. ఇందులో సముద్రఖని మరో ప్రధాన పాత్రధారి. 


'రామం రాఘవం' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పొలవరపు ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇవాళ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు.


ఇది తండ్రీ కొడుకుల ప్రేమ కథ!
'నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న. హ్యాపీ వేలంటైన్స్ డే డాడీ' - ఇదీ 'రామం రాఘవం' గ్లింప్స్ చివరలో వినిపించే ధనరాజ్ మాట. సినిమాలో ఆయన కొడుకు పాత్ర చేస్తే... సముద్రఖని తండ్రిగా కనిపించనున్నారు. తండ్రీ కొడుకుల ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఒక్క చిన్న వీడియోతో చక్కగా చెప్పారు ధనరాజ్. 


'మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో మీకు తెలుసు. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో మీకు తెలుసా?' అంటూ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియా ద్వారా 'రామం రాఘవం' గ్లింప్స్ విడుదల చేశారు. సినిమా భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


Also Readఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!






దర్శకుడు హరీష్ శంకర్ నేరుగా గ్లింప్స్ విడుదల చేసి ''ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా... మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో 'రామం రాఘవం' తీశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఎమోషనల్ జర్నీతో రాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజున తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ కళ్లకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లింప్స్ విడుదల చేయడం కొత్తగా ఉంది'' అని చెప్పారు.


Also Readతెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కల్ట్ లవ్ స్టోరీలు ఇవే - ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రాలు



''ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నాం. సముద్రఖని గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా బాగా వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని దర్శకుడు, నటుడు ధనరాజ్ కొరనాని తెలిపారు. 



'రామం రాఘవం' సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, 'చిత్రం' శ్రీను, ప్రమోదిని, 'రాకెట్' రాఘవ, 'రచ్చ' రవి, ఇంటూరి వాసు తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి 'విమానం' చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ  అందించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండగా... మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. దుర్గా ప్రసాద్ కెమెరామెన్.