తెలుగు బుల్లితెరపై సుమ చేసే సందడి మామూలుగా ఉండదు. చక్కటి పంచులు, అదిరిపోయే కౌంటర్లు, ఆకట్టుకునే మాటలతో టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. షో ఏదైనా తన మార్క్ హోస్టింగ్ తో ఆకట్టుకుంటుంది. ఆమె షోలో బాగా ఎంటర్ టైన్ మెంట్ అందించేది 'సుమ అడ్డా' . తాజాగా ఈ షోలో ‘పరేషాన్’ మూవీ టీమ్ పాల్గొన్నది. వారితో పాటు రానా షోలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.
'సుమ అడ్డా'లో ‘పరేషాన్’ టీమ్ సందడి
తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ లో, త్వరలో విడుదల కానున్న 'పరేషాన్' అనే సినిమా టీమ్ పాల్గొన్నది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో తిరువీర్, హీరోయిన్ పావనీ కరణం, డైరెక్టర్ రొనాల్డ్ సన్‌తో పాటు దగ్గుబాటి రానా గెస్టులుగా పాల్గొన్నారు. వీళ్లతో కలిసి సుమ కిర్రాక్ కామెడీ చేసింది.
పంచులతో నవ్వించిన రానా
ఈ షోలో రానా వేసిన పంచులు అందరినీ ఎంతో నవ్వించాయి. రానా, తిరువీర్‌తో కలిసి సుమ 'బాహుబలి 2' స్ఫూఫ్ చేశారు. అందులో బాహుబలి తల నరికిన సీన్‌ను రీ క్రియేట్ చేశారు. సుమను రానా ఏమైందని అడిగారు. 'బిర్యానీ పొట్లం కోసం లైన్‌లో నిల్చుంటే వీడు నన్ను తాకాడు. అప్పుడే వేలు నరికేశానని చెబుతుంది. దీంతో రానా నరకాల్సింది వేలు కాదు.. బిర్యానీ ప్యాకెట్‌ను అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. ఈ పంచ్ తో షోలో నవ్వుల పువ్వులు పూశాయి. అటు ఈ షోలో రూ. 500 నోటుతో రానా చేసిన కామెడీ అందరినీ అలరించింది. ఎదుటి టీమ్ చెప్పిన సమాధానం కాదు అని చెప్తూ రానా రూ. 500 పందెం కాశారు. ఈ షో హిస్టరీలోనే ఇంత తక్కువ అమౌంట్ ఎవరూ పెట్టలేని సుమ తెలిపింది. అయితే, ఈ రూ. 500కు చిల్లర ఇవ్వు అంటూ మరో పంచ్ వేశారు. దీంతో అందరూ ఫుల్ గా నవ్వేశారు. ఇండస్ట్రీలో మందుపార్టీ అనగానే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్లు ఎవరు? అని సుమ అడగ్గా, ఓ బ్యాచే ఉందని తెలిపారు రానా. ఆ ముఠాకు తానే మేస్త్రీని అని చెప్పడంతో అందరూ విరగబడి నవ్వారు. మొత్తంగా ‘పరేషన్’ టీమ్ ‘సుమ అడ్డా’లో కామెడీతో సుమను పరేషాన్ చేసింది. సుమ ప్రశ్నలకు రానా ఫన్నీ సమాధానాలతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ జూన్ 3న ప్రసారం కానుంది.
'మసూద' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన తిరువీర్.. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో రూపొందించిన 'పరేషాన్' సినిమాతో కామెడీ పంచడానికి వస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుద్దరాఖాన్ రవి, రాజు బెడిగేలా ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్