టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
తేజ దగ్గర సక్సెస్ అయితే, ఎక్కడైనా రాణిస్తాం
ఇప్పటికే ‘అహింస’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజా అభిరామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన డెబ్యూ మూవీ గురించి, దర్శకుడు తేజ గురించి కీలక విషయాలు వెల్లడించారు. తేజ దగ్గర పని చేస్తే ఎక్కడైనా సక్సెస్ కావొచ్చని చెప్పారు. “తేజ అనే దర్శకుడు ఒక బ్రాండ్. కొత్త యాక్టర్స్ ను తీర్చిదిద్దే బ్రాండ్ ఆయన. ఎలాంటి వారినైనా ఆయన అద్భుతంగా షైన్ చేస్తారు. ఆయన దగ్గర పని చేస్తే మనం ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఆయన దగ్గర సక్సెస్ అయితే, బయట ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేయగలం. సినిమాలోనే కాదు, బయట కూడా చేయగలం. ఎక్కడైనా సక్సెస్ కావొచ్చు. ఆయన ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్తారు. తప్పా, రైటా అని కూడా వివరిస్తారు. నన్ను జీరో నుంచి పై లెవల్ కు పంపిస్తున్నారు. సినిమా ప్రారంభంలో ఒకే విషయాన్ని చెప్పారు. నువ్వు ఏమైనా కావొచ్చు. కానీ, ఇప్పుడు జీరో అని గుర్తు పెట్టుకో. జీరో నుంచి నువ్వు టాప్ కు వెళ్లాలి. నీ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కావాలి. అందుకోసం కష్టపడాలి” అని తేజ చెప్పినట్లు అభిరామ్ వివరించారు.
అన్ని విషయాల్లో బ్యాగ్రౌండ్ పనికిరాదు
తనకు మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందని, అయితే, అన్ని విషయాల్లో అది పనికిరాదని అభిరామ్ వివరించారు. “ఎవరైనా వారికి ఉన్న టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకోవాలి. అంతేకానీ, బ్యాగ్రౌండ్ చెప్పుకొని సినిమాలు చేయకూడదు. రానా తమ్ముడిగా, వెంకటేష్ అన్న కొడుకుగా ఓ వంద సినిమాలు చెయ్యొచ్చు. కానీ, సక్సెస్ కాలేము. అందుకే నేను సినిమాల్లోకి రావడానికి ఇంత సమయం పట్టింది. టాలెంట్ పెంచుకునే ఈ సినిమాలోకి అడుగు పెట్టాను. ఈ సినిమాతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటాను అని భావిస్తున్నాను. ఈ సినిమా చూసి ఫ్యామిలీ మెంబర్స్ మెచ్చుకున్నారు. సినిమా బాగుంది అని చెప్పారు. కొన్ని కరెక్షన్స్ కూడా చెప్పారు. అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు సూచించారు” అని అభిరామ్ తెలిపారు.
ఇక అందరి కెరీర్ లో స్ట్రగుల్స్ ఉంటాయన్నారు అభిరామ్. అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఇప్పుడే తన కెరీర్ స్టార్ట్ అయ్యిందన్న ఆయన అప్ అండ్ డౌన్స్ గురించి పెద్దగా తెలియదన్నారు. ఈ సినిమా తర్వాత తెలుసుందన్నారు. నా కెరియర్ ఏంటి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయాల మీద మరింత క్లారిటీ వస్తుందన్నారు.
Read Also: నెట్‌ఫ్లిక్స్, డిస్నీల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌తో పిచ్చెక్కించేస్తారట!