Alitho Saradaga 2 Promo Out Now: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోయిన చాలామంది నటీమణులు.. ఇప్పుడిప్పుడే తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో లయ కూడా ఒకరు. ఒకప్పుడు యంగ్ హీరోల సరసన నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు చాలా దగ్గరయ్యారు లయ. చాలామంది హీరోయిన్లలాగానే పెళ్లయిన తర్వాత లయ కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన లయ.. తాజాగా ‘ఆలీతో సరదాగా 2’లో గెస్ట్‌గా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


25 ఏళ్లు పూర్తి..


‘స్వయంవరం’ సినిమాలో పీకాసో చిత్రమా పాటతో ‘ఆలీతో సరదాగా’లోకి ఎంట్రీ ఇచ్చారు లయ. ఆలీ, లయ కలిసి ఆ పాటకు రెండు స్టెప్పులు కూడా వేశారు. పాట ముగిసిన తర్వాత ‘‘ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా?’’ అని లయనే అడుగుతూ ఆటపట్టించారు ఆలీ. దానికి నవ్వుతూ ‘‘నేను లయ’’ అని సమాధానమిచ్చారు. అది విన్న ఆలీ షాకయ్యారు. ‘‘నేను శ్లోక అనుకున్నారా’’ అని నవ్వారు లయ. ఆ తర్వాత ‘స్వయంవరం’ సినిమాకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పారు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ అన్నారు.


అదే చివరి సినిమా..


ఇక తన చివరి సినిమా గురించి మాట్లాడుతూ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’నే తన చివరి సినిమా అని గుర్తుచేసుకున్నారు లయ. ‘‘అందులో లైలా నువ్వా? నేనా?’’ అంటూ మూవీ విశేషాలను గుర్తుచేసుకున్నారు ఆలీ. అది విన్న లయ నవ్వుతూ.. ‘‘అవును.. మూవీ పోస్టర్‌లో కూడా కన్‌ఫ్యూజనే’’ అని అన్నారు. ఉన్నట్టుండి సినిమాలు మానేయడంతో లయ పర్సనల్ లైఫ్‌పై వచ్చిన రూమర్స్ గురించి తనను ప్రశ్నించారు ఆలీ. ‘‘లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై జీవిస్తుంది లాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది’’ అని అడిగారు. ‘‘ఎందుకు ఇదంతా. ఏం చేయకుండా ఇవన్నీ వినాలంటే చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అనే కాకుండా ఇంకా చాలా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది’’ అని వాపోయారు లయ.


ఇంట్రెస్ట్ లేదనుకున్నారు..


తన పర్సనల్ లైఫ్, పెళ్లి గురించి కూడా లయ బయటపెట్టారు. ‘‘2005లో నేను మొదటిసారి అమెరికా వెళ్లాను. అప్పుడు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో ఉందా అని ఒక ఆంటీ అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పాను. మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు’’ అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇండియాకు రావడానికి కారణమేంటి అని అడగగా.. ‘‘నేను నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను’’ అని బయటపెట్టారు. ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు చెస్ బాగా ఆడేదాన్ని అని కూడా చెప్పుకొచ్చారు లయ. తనకు మసాలా పల్లి అంటే ఇష్టమని తన ఇష్టాలను కూడా బయటపెట్టారు. అలా ‘ఆలీతో సరదాగా’ ప్రోమో అంతా చాలా సరదాగా సాగింది.



Also Read: ఆధ్య, అకీరాకు నేను ఇచ్చింది అదే - వాళ్లు ఏం నిలబెట్టుకుంటారో చూడాలి: పవన్ కల్యాణ్