యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో విడుదలై ప్లాప్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతోంది. వచ్చే ఆదివారమే టెలికాస్ట్ కాబోతోంది. డీటెయిల్స్ లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్' ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా కృతి సనన్ సీతగా కనిపించింది. అలాగే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవ దత్త నగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ నటించిన మొదటి పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.


టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంత నెగిటివిటీ తెచ్చుకున్న ఈ మూవీ.. ట్రైలర్ తో దాన్ని పోగొట్టుకొని సినిమాపై అంచనాలను పెంచింది. అలా భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది ఈ చిత్రం. ముఖ్యంగా రామాయణాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై హిందూ సంఘాలతో పాటు ఎంతోమంది విమర్శకులు విరుచుకుపడ్డారు. అలా 'ఆదిపురుష్'  కంప్లీట్ నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. తొలి 3రోజులు సుమారు రూ.350 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత నుంచి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవి చూసింది.


'ఆదిపురుష్'తో ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్ చేరింది. దీనికంటే ముందు ప్రభాస్ నటించిన 'సాహూ', రాధే శ్యామ్' చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిిచాయి. ఇక 'ఆదిపురుష్' మూవీకి ఓటిటిలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాల మిగిల్చడంతో అనుకున్న దానికంటే ముందే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ ని చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. 'ఆదిపురుష్' వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను లాక్ చేసుకుంది.


ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా(Star Maa) లో వచ్చే ఆదివారం అంటే అక్టోబర్ 29 సాయంత్రం 5: 30గం. లకు 'ఆదిపురుష్' టెలికాస్ట్ కానుంది. మరి థియేటర్స్, ఓటీటీలో పెద్దగా ప్రభావం చూపించని 'ఆదిపురుష్' బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న 'సలార్'(Salaar) కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ప్రభాస్ భారీ కం బ్యాక్ ఇస్తాడని ఫాన్స్ ఆశిస్తున్నారు. హోం బలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.


Also Read : నాని కొత్త సినిమాలో తమిళ నటుడు - అఫీషియల్​గా అనౌన్స్ చేసిన మేకర్స్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial