Jabardasth Sathya Sri: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చక్కగా రాణిస్తున్నారు. కొందరు ఏకంగా హీరోలుగా మారిపోగా, మరికొంత మంది కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు సత్యశ్రీ. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా విడుదలైన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలో ‘‘నా పెట్టీ తాళం తెరిచి..’’ సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.


అతడి కోసమే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వెళ్లా!


కేవలం చమ్మక్ చంద్ర కోసమే గతంలో ‘జబర్దస్త్’ నుంచి బయటకు వెళ్లినట్లు చెప్పింది సత్యశ్రీ. కానీ, ఏనాడు ఆ షో నుంచి బయటకు ఎందుకు వచ్చానా? అని ఆలోచించలేదని చెప్పింది. “చంద్ర కోసమే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చాను. ఇతర కారణాలు ఏవీ లేవు. బయటకు అనవసరంగా వచ్చాం అని ఎప్పుడూ అనిపించలేదు. ‘కామెడీ స్టార్స్’ తర్వాత నేను సినిమాల్లో బిజీ అయ్యాను. ఆ తర్వాత మళ్లీ ‘జబర్దస్త్’లోకి రీఎంట్రీ ఇచ్చాను. రోహిణి లాంటి వారు టీమ్ లీడ్ చేసే స్థాయికి వచ్చారు. నేను అక్కడే ఉండి ఉంటే నేనూ ఆ స్థాయికి చేరేదాన్ని. టీమ్ లీడర్ అనేది చాలా పెద్ద బాధ్యత. కంటెస్టెంట్ గా ఈజీగా చేయగలం. టీమ్ లీడర్ అంటే స్కిట్ చూడాలి. డైలాగులు చూసుకోవాలి. 10 రోజుల ముందు నుంచే ప్రిపేర్ కావాలి. అదో పెద్ద పని. దాన్ని నేను హ్యాండిల్ చేయలేను. అందుకే కంటెస్టెంట్ గా చేస్తున్నాను. వెళ్లామా? హ్యాపీగా స్కిట్ చేశామా? వచ్చామా? అన్నట్లు ఉంది” అని చెప్పుకొచ్చింది.


రామ్ పోతినేని అంటే చాలా ఇష్టం!


ఇక తనకు హీరో రామ్ పోతినేని అంటే చాలా ఇష్టమని చెప్పింది సత్యశ్రీ. “నాకు హీరో రామ్ అంటే క్రష్. రామ్ పోతినేని అంటే చాలా ఇష్టం. తనతో కలిసి ‘పండగ చేస్కో’ సినిమాలో నటించాను. రకుల్ ఫ్రెండ్ గా చేశాను. అప్పుడు నటించడం మానేసి ఆయననే చూస్తూ ఉండేదాన్ని. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం” అని చెప్పింది.


నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే?


తనకు ప్రేమ, పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తి లేదని చెప్పింది సత్యశ్రీ. అయితే, తనతో పాటు తన ప్రొఫెషన్ ఇష్టపడే వాడు వస్తే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది. “నాకు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. కానీ, ప్రేమ, పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదు. ఓ అబ్బాయి నాతో టూ మచ్ గా వ్యవహరించాడు. నేను అప్పుడు 9వ తరగతిలో ఉన్నాను. విషయం మా పేరెంట్స్ కు చెప్పాను. వాళ్లు తనకు వార్నింగ్ ఇచ్చారు. బుద్దిగా చదువుకోవాలని చెప్పారు. ఆ తర్వాత తను నావైపు రాలేదు. ఇండస్ట్రీ నుంచి ప్రపోజల్స్ రాలేదు. డైరెక్ట్ పెళ్లే అన్నారు. కానీ, నేరుగా నాతో చెప్పలేదు. మా అమ్మతో చెప్పారట. నేను వద్దు అన్నాను. వాళ్ల పెళ్లి కూడా అయిపోయింది. నా ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్ ని కలిపి చూడకూడదు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. అప్పుడే సంసారం చక్కగా కొనసాగుతుంది. అనుమానం అనేది ఉండకూడదు. నన్ను, నా ప్రొఫెషల్ లైఫ్ ని అర్థం చేసుకునే వాడిని పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది.


అవకాశాలు వచ్చినా వదులుకున్నా!


ఇప్పటి వరకు రెండు, మూడు సినిమాల్లో మెయిన్ లీడ్ ఆఫర్లు వచ్చినట్లు సత్యశ్రీ చెప్పింది. అయితే ఎక్స్ పోజ్ చెయ్యాలని చెప్పడంతో వదులుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ భవిష్యత్ లో అవకాశాలు వచ్చినా, లిప్ లాక్ లాంటి సన్నివేశాలు చేయనని చెప్పింది. సాయి పల్లవి లాంటి క్యారెక్టర్లు చేయాలనుందని చెప్పుకొచ్చింది.  


Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!