టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాను కూడా హిందీలో డబ్ చేశారు. ఈ మూవీకి హిందీలో ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హిందీలో తనకంటూ  ఓ గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ, నేరుగా హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు అడుగు పెట్టబోతున్నారు. తెలుగులో ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలోకి రీమేక్ అవుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది.


ఆకట్టుకుంటున్న ‘ఛత్రపతి‘ ట్రైలర్


ఇప్పటికే ‘ఛత్రపతి‘ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్  ఆద్యంతం అదిరిపోయే యాక్షన్ సీన్లతో నిండిపోయింది. తెలుగులో ప్రభాస్ యాక్టింగ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బెల్లకొండ శ్రీనివాస్ కష్టపడ్డారు. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్  పవర్ ప్యాక్డ్ గా రూపొందింది. యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఫైటింగ్స్, యాక్షన్ లాంటి సన్నివేశాల్లో బెల్లంకొండ అదుర్స్ అనిపించాడు.  బెల్లంకొండ, నుష్రత్ భారుచ్చా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.






తెలుగు రిజల్ట్ హిందీలోనూ వస్తుంది- బెల్లంకొండ    


ముంబైలో ‘ఛత్రపతి‘ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బాంద్రా వెస్ట్ లోని గైటీ గెలాక్సీలో ఈ వేడుక జరిగింది. చిత్ర బృందం ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ తన సినీ జర్నీ గుర్తించి పలు  విషయాలు వెల్లడించారు. ‘’ఛత్రపతి - నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నా తొలి తెలుగు సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. నా బాలీవుడ్ ఎంట్రీకి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. హిందీలోనూ అదే రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాను. ‘ఛత్రపతి’ సినిమా కమర్షియల్ గా చక్కటి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాను” అని బెల్లంకొండ తెలిపారు.


బెల్లంకొండతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది- నుష్రత్ భరుచ్చా


అటు ‘ఛత్రపతి’ సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ నుష్రత్ భరుచ్చా తెలిపారు.  “స్క్రీన్‌ మీద నేచురల్ గా కనిపించే శ్రీనివాస్ బెల్లంకొండతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నటించడం మంచి అనుభూతిని కలిగించింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. ‘ఛత్రపతి’ సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది” అని చెప్పుకొచ్చింది.


చక్కటి యాక్షన్ సినిమా చూశామనే భావన కలిగిస్తుంది- జయంతి లాల్ గడా


‘ఛత్రపతి’ సినిమా ప్రేక్షకులకు చక్కటి యాక్షన్ సినిమా చూశామనే భావన కలిగిస్తుందిన నిర్మాత  జయంతి లాల్ గడా వెల్లడించారు. “ఛత్రపతిలో యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం పాన్-ఇండియా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుంది. చిత్ర బృందం కృషికి ట్రైలర్ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని, వారి ప్రేమను మాపై కురిపిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.


Read Also: బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ రిలీజ్, మాస్ యాక్షన్ తో ఊచకోత!