నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో నిరసన కార్యక్రమాల పేరు చెప్పి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్‌కి ఆయన రెండు ఛాన్స్ లు ఇచ్చారు, ఆ రెండు ఛాన్స్ లను వినియోగించుకోకపోతే నెల్లూరు నగరంలోని క్రైస్తవ సోదరులతో కలసి ఇటుకలు తీసుకొచ్చి భారీ నిరసన చేపడతామన్నారు. 


కోటంరెడ్డి పోరాటం దేనికోసం..?
నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి పోరుబాట పట్టారు. కొత్తగా నిర్మించాలని తాము అడగడంలేదని, గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని అడుగుతున్నామంటున్నారు కోటంరెడ్డి. గతంలో సీఎం జగన్ మూడుసార్లు సంతకాలు పెట్టినా ఫలితం లేదని గుర్తు చేశారు కోటంరెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల కాలంలో నెల్లూరు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం సీఎం జగన్ 3 సార్లు సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. 6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 


కమ్యూనిటీ హాల్ నిర్మించకపోతే..
నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈ నెల 8న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సీఎం జగన్ కార్యాలయానికి పోస్ట్ కార్డులు, వాట్స్ యాప్, టెక్స్ట్ మెసేజ్ లను పంపించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు కోటంరెడ్డి. అప్పటికైనా ప్రభుత్వం కరుణించకపోతే.. తర్వాతి పది రోజులు నగరం, రూరల్ లోని చర్చిల వద్ద నుంచి క్రిస్టియన్ సోదరుల ద్వారా నేరుగా సీఎంఓ కార్యాలయానికి మెసేజ్ లు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. అప్పటికీ స్పందన లేకపోతే పెద్ద ఎత్తున నిరసనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈనెల 18వ తేదీన గాంధీనగర్ లోని కమ్యూనిటీ హాల్ స్థలం వద్దకు నగర, రూరల్ లోని చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసన చేపడతామన్నారు. 


శిలా ఫలకానికి విలువ ఏది..?
సీఎం జగన్ హామీలతో అప్పటి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి 150 అంకణాల స్థలాన్ని ఏర్పాటు చేసి శిలాఫలకం వేశామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సాక్షాత్తూ సీఎం జగన్ సంతకం పెట్టినా విలువ లేదని, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జగనే బాధ్యత వహించాలన్నారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధికారులు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా పని కాలేదన్నారు. అధికార పార్టీ నుంచి బయటకి వచ్చాక సమస్యలని వదిలేయాలని తాను అనుకోలేదని చెప్పారు. మూడు నెలల్లోపు 6 కోట్ల నిధులను విడుదల చేస్తామని జిల్లా మంత్రి, ఇంచార్జ్, ముఖ్యనేతలు ప్రకటించాలని డిమాండ్ చేశారు కోటంరెడ్డి. అప్పుడే తన పోరాటం ఆపేస్తానన్నారు. 


ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను ఆరోగ్యవంతమైన రాజకీయం చేస్తున్నానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తాను అధికార పార్టీ నుంచి దూరం జరిగాక కొత్త సమస్యలపై మాట్లాడటం లేదని, నాలుగేళ్లుగా అడుగుతున్న సమస్యలపైనే ఇప్పుడు మళ్లీ మాట్లాడుతున్నానని అన్నారు. తనకు కొత్తగా సమస్యలు గుర్తొచ్చాయా అని అధికార పార్టీ నేతలు అంటున్నారని, ఆ మాటల్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.