సముద్రంలోనే తుపానుల్ని అణచివేసే శక్తి, సామర్ధ్యం తమ ప్రభుత్వానికి లేవన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. వర్షాలు కురవడం ప్రభుత్వ వైఫల్యం అయినట్లు టీడీపీ అనుకూల మీడియా కథనాలిస్తోందని మండిపడ్డారాయన. ముఖ్యంగా ఈనాడులో వచ్చిన వార్తలకు కౌంటర్ గా మంత్రి కాకాణి ప్రెస్ మీట్ పెట్టారు. పక్షపాత వైఖరితో ఈనాడు వార్తలు రాస్తోందని, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కల్పించి కథనాలిస్తోందని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమపై బురదజల్లుతున్నారని, రైతుల్లో తమకున్న పేరుని తగ్గించేందుకు కావాలనే కట్టుకథలల్లుతున్నారని చెప్పారు కాకాణి.
వ్యవసాయ రంగంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పారు మంత్రి కాకాణి. ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్న వ్యవసాయ రంగంపై కూడా ఇలా రోత రాతలు రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమేనా అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపు తమ ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాలు పరిహారం విషయంలో ఎంత తాత్సారం చేశాయో అందరికీ తెలుసన్నారు. తాము అధికారంలోకి పచ్చాక, పరిహారం ఇవ్వాల్సిన సందర్భాలే చాలా తక్కువ అని, అసలు ఏపీలో కరువు మండలాలే లేవన్నారు. వర్షాలతో రైతులు ఇబ్బంది పడినా కూడా వెంటనే పరిహారం అందిస్తున్నామని వివరించారు. అంతే కానీ, తమకు సముద్రంలోనే తుపానులను అణచివేసే శక్తి, సామర్ధ్యం లేవని చురకలంటించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 లో కర్నూలు జిల్లాలో అకాల వర్షాలు వస్తే, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం పరిహారం అందించిందని. 2016 లో అరకొరగా పరిహారం ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని విమర్శించారు మంత్రి కాకాణి. 2015 లో కరువు వస్తే దానికి సంబంధించిన పరిహారం 2016లో ఇచ్చారని గుర్తు చేశారు. రైతులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించిందని, అయినా కూడా అప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏనాడూ వాస్తవాలు బయటపెట్టలేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సకాలంలో అన్నీ జరుగుతున్నా తమపై తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. 2014-15 లో 21 కోట్ల రూపాయల బకాయిలు.. 2016-2017 లో రూ.10 కోట్లు, 2018-19 లో రూ.2238 కోట్లు.. బకాయిలు పెట్టి చంద్రబాబు దిగిపోయారని.. మొత్తంగా చంద్రబాబు 2558 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా బకాయిలు పెట్టారని గుర్తు చేశారు.
చంద్రబాబు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేక పోయారని రామోజీ రాయగలరా..? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి. చంద్రబాబు హయాంలో లాగా.. వైసీపీ కూడా కరువు మండలాలు ప్రకటించాలని ఈనాడులో వార్తలిస్తున్నారని, రైతులను ఎలా ఆదుకోవాలి.. వారికి అండగా ఉండాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తున్నారు, ఆ విషయంలో తమకు సలహాలు అక్కర్లేదని చెప్పారు. చంద్రబాబు వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరించి.. రైతాంగానికి పరిహారం ఇవ్వకుండా బకాయిలు పెట్టేశాని, చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన 474 కుటుంబాలకు సుమారు 24 కోట్ల రూపాయల పరిహారం జగన్ సీఎం అయిన తర్వాతే అందిందని గుర్తు చేశారు.
వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో రైతులకు ఇవ్వాల్సిన సుమారు 5942 కోట్ల రూపాయలు చంద్రబాబు బకాయిలు పెట్టారన్నారు. కరువు మండలాన్ని ప్రకటించే అవసరం తమకు రాలేదని, రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని సీజన్ ముగిసే లోపు అందిస్తున్నామని వివరించారు.
ఇటీవల మొక్క జొన్న పంట నష్టపోయిన చోట.. ఆ పంటను కొనుగోలు చెయ్యాలని మార్కెటింగ్ శాఖకి ఆదేశాలు ఇచ్చామన్నారు కాకాణి. నెల్లూరు జిల్లాలో జరిగిన పసుపు కుంభకోణంలో టీడీపీ నేతలు అక్రమాలు చేస్తే.. ఉద్యోగులు బలి అయ్యారని చెప్పారు. రైతు రథం, నీరు - చెట్టు కార్యక్రమాల్లో అప్పట్లో భారీ అవినీతి జరిగిందని అవన్నీ ఈనాడుకి కనపడలేదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చి రైతులు సంతోషంగా ఉంటే.. టీడీపీకి, వారి అనుకూల మీడియాకి మాత్రం కడుపు మండుతుందన్నారు. ఈనాడు పనికి మాలిన రాతలను రైతులు కానీ, రాష్ట్ర ప్రజలు గానీ నమ్మే స్థితిలో లేరన్నారు కాకాణి.