కోస్తా రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ జగన్ దగ్గర బాలినేని వ్యవహారంపై ఏం తేలుతుంది..? జగన్ బుజ్జగిస్తారా, మందలిస్తారా..? బాలినేని ఊ అంటారా..? ఉహూ అంటారా..? ఈరోజు తేలిపోతుంది. 


మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డి అలకలోనే ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే ఆ అలక కేవలం తన మంత్రి పదవి పోయినందుకు కాదు, తన జిల్లాలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించినందుకు. ప్రకాశం జిల్లాలో తన ఇమేజీ డ్యామేజీ అయిందనే బాలినేని వాదన. దాన్ని కవర్ చేయడానికి ఆయనను రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు సీఎం జగన్. కానీ బాలినేనికి అదేమీ ఇష్టం లేదు. పైగా ఇటీవల మార్కాపురం వ్యవహారం తర్వాత బాలినేని మరింత హర్ట్ అయ్యారు. సొంత జిల్లాలో సీఎం వస్తే, తనను హెలిప్యాడ్ వద్దకు పంపించకపోవడమేంటని ఆయన అలిగి ఇంటికెళ్లారు. తిరిగి సీఎం పిలిచాక సభకు వచ్చారు. అప్పటినుంచి ఆయన మూడ్ ఆఫ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ వ్యవహారం మరింత హైలెట్ అయింది. ఈరోజు సీఎం జగన్ దగ్గర పంచాయితీలో ఏం తేలుతుందో చూడాలి. 


రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు లేఖ రాయడంతోపాటు, పార్టీ పెద్దలకు ఆ విషయం చేరవేశారు బాలినేని. వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి మాట్లాడేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కి తగ్గలేదు. దీంతో, నేరుగా సీఎం జగన్‌ తో మాట్లాడాలంటూ సీఎంవో అధికారుల నుంచి ఆయనికి సమాచారం వెళ్లింది. వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు. 


సీఎం ఇచ్చే హామీ ఏంటి..?
ఇంతకీ సీఎం జగన్ బాలినేనికి ఇచ్చే హామీ ఏంటనేది ప్రశ్నార్థకం. ఒకవేళ హామీ ఇవ్వకపోతే ఇలాంటివి ఇంకెప్పుడూ రిపీట్ చేయొద్దని మందలించే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే బాలినేని వైసీపీలో ఉండరని అంటున్నారు. ఆల్రెడీ ఆయన జనసేన అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని కూడా ప్రకాశం జిల్లా టాక్. కానీ వైఎస్ కుటుంబానికి బంధువైన బాలినేని.. అంత త్వరగా వైసీపీని వదిలిపెడతారని అనుకోలేం. కనీసం బంధుత్వానికి విలువ ఇచ్చయినా జగన్ ఆయన్ను తనతో అట్టిపెట్టుకుంటారు. భవిష్యత్తుకి భరోసా ఇస్తాననే హామీ ఇస్తారు.


బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లాతోపాటు, అటు బాపట్ల, ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలను కూడా ప్రభావితం చేయగల వ్యక్తి. ఇప్పటి నుంచే తన వారసుడికి లైన్ క్లియర్ చేస్తూ ఆయన ముందుకెళ్తున్నాడు. ప్రకాశం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఆయన అనుచరులున్నారు. పార్టీ జయాపజయాలను శాసించే స్థాయిలో ఆయనకు మద్దతుదారులున్నారు. ఈ దశలో బాలినేని వంటి కీలక నేతను వదులుకోవడం జగన్ కి నష్టమనే చెప్పాలి. అందుకే వీలైనవంత వరకు బుజ్జగింపులకే ఆస్కారం ఉంటుంది. బాలినేని భవిష్యత్ తేలితే వైసీపీ అంతర్గత రాజకీయాల్లో అది ఓ కీలక పరిణామం అవుతుంది.