వచ్చే జూలై నెల నుంచి టాలీవుడ్ లో కొత్త సినిమాల జాతర మొదలవ్వనుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలా సినిమాలు కూడా పోటీలో నిలవనున్నాయి. వాటిలో కొన్ని సీక్వెల్స్ తో ఆసక్తి రేపుతుండగా మరికొన్ని క్రేజీ కాంబినేషన్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన ‘బ్రో’ మూవీ ఇంకా ప్రభాస్ నటించిన ‘సలార్’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటిలో కొన్ని విడుదలకు సిద్దంగా ఉండగా మరికొన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్..


టాలీవుడ్ లో పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా విడుదల జాబితాలో ఉన్నాయి. వాటిల్లో మూడు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. అలాగే సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, ఇంకా పి.వాసు దర్శకత్వంలో వస్తోన్న ‘చంద్రముఖి 2’. ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ 15 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘టిల్లు స్క్వేర్’, ‘చంద్రముఖి 2’ సినిమాలు రెండూ సూపర్ హిట్ అయిన ‘డీజే టిల్లు’, ‘చంద్రముఖి’ సినిమాలకు సీక్వెల్స్ గా వస్తున్నాయి. వీటితో పాటు బోయపాటి-రామ్ కాంబోలో వస్తోన్న మూవీ కూడా వీటితో పాటు విడుదల కానుంది. 


మూడూ భారీ అంచనాలు ఉన్న సినిమాలే..


సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మూవీ ‘డీజె టిల్లు’ కు సీక్వెల్ గా వస్తోంది ‘టిల్లు స్క్వేర్’ మూవీ. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేహా శెట్టి స్థానంలో అనుపమా పరమేశ్వరన్ ఎంపికైంది. ఈ మూవీపై కూడా భారీ అంచానాలే ఉన్నాయి. దీనితో పాటు మరో సీక్వెల్ సినిమా ‘చంద్రముఖి 2’. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు ఇది సీక్వెల్ అని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. దానితో పాటు ఈ పార్ట్ 2 ప్రధాన పాత్రలుగా రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లు నటించబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే బోయపాటి శ్రీను-హీరో రామ్ కాంబోలో వస్తోన్న మూవీ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు ప్రకటించినప్పటి నుంచీ మూవీపై బజ్ పెరిగింది. ఇప్పుడు ఈ మూడు భారీ సినిమాలు సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్లానింగ్, ప్రమోషన్స్ బాగా జరిగితే ఈ మూడు సినిమాలకు ఉన్న పాజిటివిటీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు ఫిల్మ్ వర్గాలు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి పోటీ ఇస్తారో చూడాలి. 


Also Read: బార్‌లో ఒకే సిట్టింగ్‌తో ఆ డైరెక్టర్‌తో మూవీకి ఓకే చెప్పేసిన అల్లరి నరేష్ - అనౌన్స్‌మెంట్ వీడియో అదుర్స్!