నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య పోటీ గత కొద్ది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నందమూరి తారక రామారావు మొదలుకొని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. అటు చిరంజీవి మొదలుకొని రామ్ చరణ్ వరకు మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా సినిమా పరిశ్రమను ఏలుతూనే ఉన్నారు. తాజాగా ఇరు కుటుంబాల మధ్య కొనసాగుతున్న పోటీ గురించి ‘RRR’ స్టార్లు Jr NTR, రామ్ చరణ్ స్పందించారు. 30 ఏళ్ల పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


దశాబ్దాలుగా ఇరు కుటుంబాల మధ్య పోటీ


జూ. ఎన్టీఆర్,  ప్రముఖ నటుడు, రాజకీయవేత్త ఎన్.టి.రామారావు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుండగా, రామ్ చరణ్ మెగా స్టార్ చిరంజీవి కుమారుడు. ఇరు కటుంబాల మధ్య పోటీ ఉన్నా, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ఎంతో స్నేహంగా మెలుగుతారు. ఇద్దరు కలిసి నటించిన ‘RRR’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా Jr NTR, రామ్ చరణ్ అమెరికాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల్లో పాల్గొన్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబాల మధ్య సినిమాల పరంగా ఉన్న పోటీ గురించి స్పందించారు. 


పోటీని వదిలి స్నేహంగా ముందుకు వెళ్తామంటున్న ‘RRR’ స్టార్స్


రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్ టైమ్స్‌ తో మాట్లాడుతూ, తాను, జూనియర్ ఎన్టీఆర్.. ఇరు కుటుంబాల మధ్య పోటీ వార్తలతో విసిగిపోయామని చెప్పారు. ఇకపై స్నేహితులుగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. “పోటీని కలిగి ఉండాలనే  భావన మమ్మల్ని ఒకచోట చేర్చింది. మూడు దశాబ్దాలకు పైగా పోటీ వార్తలతో విసుగు చెందాం. ఇకపై స్నేహంగా ముందుకు సాగాలి అనుకుంటున్నాం” అని చరణ్ అన్నారు. తారక్ వారి స్నేహం గురించి మాట్లాడుతూ, “మా స్నేహం సాధారణ భౌతిక శాస్త్రం మాదిరిగానే ఉంటుంది. వ్యతిరేక ధృవాలు ఆకర్షిస్తాయి. చరణ్ తనలో లేని వాటికి ఆకర్షితుడయ్యాడు. నాలో నేను సాధించలేని వాటి పట్ల నేను ఆకర్షితుడయ్యాను. ఇద్దరం అలా కలిసిపోయాం” అని వెల్లడించాడు.  






ఆస్కార్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు


అటు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘RRR’ సినిమా అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు, రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను అందుకుంది. ఇక ఆస్కార్స్  అవార్డులపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ సినిమా ఆస్కార్స్ ను సైతం అందుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.


Read Also: నిన్న గోల్డెన్ గ్లోబ్, నేడు క్రిటిక్స్ ఛాయిస్ - అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతున్న ‘RRR’