ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం కష్టం. కనీసం, ఒక్కోసారి ఊహించలేం కూడా. అల్లరి చిల్లరగా తిరిగేవాళ్లు గొప్పవాళ్లుగా మారిపోవచ్చు. క్రమశిక్షణతో మెలిగినవారు ఆ తర్వాత దారి తప్పవచ్చు. ఇంతకీ, ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే? ఇప్పుడు మనం ఓ బాలీవుడ్ స్టార్ హీరో గురించి తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు జులాయిగా తిరిగి, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఆయన... ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ కథానాయకుడిగా ఎదిగాడు. అద్భుత చిత్రాల్లో నటించాడు. నిర్మాతగా కూడా మారిపోయాడు. ఆయన సేవలకు ఏకంగా పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఇంతకీ తను ఎవరో కాదు, హీరో అజయ్ దేవగన్. రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఆయన, తన అద్భుత నటనకు గాను ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న భారతీయ ఓటీటీ స్టార్ కూడా అతడే కావడం విశేషం.
నాలుగు జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం
అజయ్ దేవగన్ బాలీవుడ్ లో అద్భుత చిత్రాలు చేశాడు. ‘సింగం’, ‘భోలా’, ‘గోల్‌మాల్’, ‘తాన్హాజీ’ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అద్భుత నటనకు గాను 4 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా ఆయనను వరించింది. 1991లో ఆయన చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు. అజయ్ అసలు పేరు విశాల్ కాగా, ఆ తర్వాత అజయ్ గా మార్చుకున్నాడు. యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘ఫూల్ ఔర్ కాంటే’తో ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలోని నటనకు గాను బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ‘కానూన్’, ‘దిల్‌వాలే’, ‘జిగర్’, ‘ఇష్క్’ సహా పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అతడు ‘జఖ్మ్’, ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘తాన్హాజీ’ చిత్రాల్లో నటనకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
రెండుసార్లు జైలుకు వెళ్లిన అజయ్
తాజాగా ఆయన తన చిన్నతనంలో చేసిన అల్లరి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా తను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? అనే విషయాలను వెల్లడించారు. “ఇప్పుడు నాకు మంచి ఇమేజ్ ఉంది. కానీ, యంగ్ ఏజ్ లో ఎన్నో అల్లరి పనులు చేశా. క్రిమినల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొన్నా. నిత్యం బార్ల వెంట తిరిగేది. రెండుసార్లు లాకప్ లోకి వెళ్లాను. మా నాన్న తుపాకీని కూడా దొంగచాటుగా బయటకు తీసుకెళ్లేది” అని వివరించాడు. ఇక హీరోగా ప్రయత్నిస్తున్న తొలినాళ్లలో చాలా మంది మేకర్స్ తనను తిరస్కరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అత్యధిక పారితోషికం తీసుకునే ఓటీటీ స్టార్
ఇక రీసెంట్ గా అజయ్ దేవగన్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో OTTలోకి అడుగు పెట్టాడు. ఈ వెబ్ సిరీస్ లో నటనకు గాను ఏకంగా రూ. 125 కోట్లు వసూలు చేశారు. అత్యధిక పారితోషికం తీసుకునే OTT స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘RRR’లో 8 నిమిషాల అతిధి పాత్ర కోసం రూ. 35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు టాక్. ‘భోలా’, ‘రన్‌వే 34’, ‘శివాయ్ అండ్ యు మీ ఔర్ హమ్’ లాంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అజయ్ దేవగన్ ప్రస్తుతం ‘మైదాన్’ చిత్రంలో కనిపించనున్నారు. అమిత్ శర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: అందుకే అక్షయ్ సినిమా నుంచి నానా పటేకర్‌ను తీసేశారా? ‘జంగిల్’ మేకర్స్‌పై నానా హాట్ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial