‘వెల్‌కమ్‌’ సిరీస్ లో భాగంగా భాగంగా వస్తున్న 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రంలో నటుడు అనిల్ కపూర్ తో పాటు తనకు అవకాశం కల్పించకపోవడంపై ప్రముఖ నటుడు నానా పటేకర్ (Nana Patekar) పరోక్ష విమర్శలు చేశారు. చిత్రబృందానికి, ముఖ్యంగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) కు తాము పాత నటుల మాదిరి కనిపించామేమో? అందుకే, తమకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు. తన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నానా పటేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘జంగిల్ 3’ మూవీలో అవకాశం కల్పించకపోవడంపై స్పందించారు.

   


‘జంగిల్’ మేకర్స్ పై నానా పటేకర్ విమర్శలు


ఇటీవల, ‘వెల్‌కమ్’ మేకర్స్ ‘వెల్‌కమ్3’ (‘వెల్‌కమ్ టు ది జంగిల్’) చిత్రానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిత్రంలో నటించే నటీనటులను పరిచయం చేశారు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ప్రోమోలో నానా పటేకర్, అనిల్ కపూర్ కనిపించకపోవడంపై సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో నానా పటేకర్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వివేక్ అగ్నిహోత్రిని చూపిస్తూ, నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇంత పెద్దవాడిని అయ్యానని వివేక్ అనుకోడు. అందుకే, ఆయన చిత్రంలో నాకు నటించే అవకాశం కల్పించాడు” అంటూ వ్యాఖ్యానించారు.  


ఆకట్టుకుంటున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్


ఇక ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, తాజాగా ‘ది వ్యాక్సీన్ వార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.  సరైన వనరులు, పెట్టుబడి లేకపోయినా కూడా భారతీయ  శాస్త్రవేత్తలు కోవిడ్ కోసం వ్యాక్సిన్ కనుక్కోవాలని ఎలా నిర్ణయించుకున్నారు? ఆ నిర్ణయానికి తగినట్టుగా ఎలా ముందుకు వెళ్లారు అనే విషయాన్ని ‘ది వ్యాక్సిన్ వార్’లో చూపించినట్టుగా అర్థమవుతోంది. ‘భారతీయ సైంటిస్టుల దగ్గర రీసెర్చ్ కోసం కనీసం  లక్ష రూపాయలు కూడా లేవట కదా’ అనే డైలాగుతో ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ మొదలయ్యింది. కోవిడ్-19  అనేది సహజంగానే వచ్చిందా?  కృత్రిమంగా సృష్టించారా? అనే విషయంపైనా ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ విడుదల


వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ బయో సైన్స్ చిత్రంలో నానా పాటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ సహా పలువురు నటీనటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు.  సీనియర్ నటి రీమా సేన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం హిందీలో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కానుంది.


Read Also: దయచేసి అర్థం చేసుకోండి - అఫీషియల్‌గా ఆ మాట చెప్పిన 'సలార్' టీమ్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial