స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదన్నారు ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారే అలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యమని.. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారని తెలిపారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు వర్క్ ఫ్రమ్ హోం అనే మెసేజ్‌ను ఇచ్చినట్లుందంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశామని.. ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉందన్నారు సుధాకర్ రెడ్డి.
రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదన్న ఆరోపణలను సుధాకర్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారిందని, ప్రత్యేకంగా ఒక బ్యారెకె ను కేటాయించారని తెలిపారు. 24 గంటలూ...సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు భద్రతను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశమన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. చంద్రబాబు రిమాండ్‌పై ఆయన తరపు న్యాయవాదులు తీవ్రమైన వాదనలు వినిపించారని ఏఏజీ తెలిపారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయని, ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ అని అన్నారు. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదని గుర్తు చేశారు.
మరోవైపు డిజైన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందంలో ఎలాంటి స్కాం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరఫున ఖన్విల్కర్ వీడియో రిలీజ్ చేశారు. తాము సరఫరా చేసిన పరికరాలకు సంబంధించిన డేటాను ఆయన వీడియోలో వివరించారు. ఏ పరికరాలు నాసిరకంగా ఉన్నా, బాగా లేకున్నా లేదా రిపేరు వచ్చినా.. వాటి పూచికత్తు తీసుకున్నామని వెల్లడించారు. అందుకు సంబంధించి ఒప్పందంలో షరతు ఉందన్నారు. ఏపీ దర్యాప్తు సంస్థలు...ఈ స్కాంకు సంబంధించి తమను సంప్రదించలేదన్నారు. ఆడిటర్లను పంపిస్తే పూర్తి లెక్కలు చూపుతామని ఖన్విల్కర్ వివరించారు.
చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. జైలులో చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు లాయర్ లూథ్రా. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని తెలిపారు. ఇంటి కంటే జైలు వద్దే భద్రత ఎక్కువ ఉందన్న ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యలతో జడ్జి ఏకీభవించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు. రిమాండ్ రిపోర్టు లో దాఖలు చేసిన పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అరెస్టు సమయంలో కాల్ రికార్డులను భద్రపర్చాలని మరోమారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.