ప్రముఖ వాణిజ్యవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ది లెంజెడ్'. జూలై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజున సినిమా విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో మాత్రమే కాదు... కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల  కాబోతుంది. దీంతో అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.  తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.

 

ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో శరవణన్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అందరికీ నమస్కారం' అంటూ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టిన శరవణన్ ఆ తరువాత ఇంగ్లీష్ లో, హిందీలో, కన్నడలో, తమిళంలో మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. లెజెండ్ స్పీచ్ అంటే ఆ రేంజ్ లో ఉండాలంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్స్ తో ఈ సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకుంటుంది. ఇప్పటికే శరవణన్ లుక్స్ పై, స్పీచ్ పై ట్రోల్స్ పడ్డాయి. మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!


లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 'లెజెండ్‌' శరవణన్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు జెడి - జెర్రీ దర్శకత్వం వహించారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఒక సామాన్యుడు తన శ్రమ, సమర్ధత, బలంతో తనకు ఎదురైన అడ్డంకులను అధిగమించి 'లెజెండ్‌'గా ఎలా నిలిచాడనేది సినిమా కథాంశం. ఇందులో మైక్రో బయాలజీ శాస్త్రవేత్తగా శరవణన్ కనిపించనున్నారు.