గోదావ‌రి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని, ఈ విష‌యం బిజెపి ప్రతినిధులు పర్యటనలో తేలిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎపీ ప్రభుత్వంపై ద్వజ‌మెత్తారు. 215 గ్రామాలు వరదలో చిక్కుకోగా 70వేల మంది కట్టు బట్టలతో రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం లేదని ఫైర్ అయ్యారు.


ముంపు ప్రాంతాల బాధితులను గాలికొదిలేసిన సీఎం జగన్ మాత్రం గాలిలోనే తిరుగుతున్నారని ఆరోపించారు విష్ణువర్దన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు, వారు తెలంగాణకు వెళ్లిపోతాం అన్నారంటే జగన్ సిగ్గు పడాలన్నారు. త్యాగాలు చేసిన కుటుంబాలను పట్టించుకోకపోవడం దుర్మార్గమ‌ని వ్యాఖ్యానించారు. ప్రజలపై జగన్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజలను జగన్ ప్రభుత్వం మనుషులుగా చూడటం లేదన్నారు. అధికారులు కూడా కనీసం తమ వద్దకు రాలేదని బాధితులు చెబుతున్నారని వివరించారు. 


విలాసవంతమైన భవనంలో ఉంటున్న సీఎం జగన్... అందరూ అలానే ఉంటారనుకోవడం భ్రమ అని కామెంట్‌ చేశారు విష్ణువర్దన్ రెడ్డి. ఇటీవల మీ ఎమ్మెల్యే ముక్కు మూసుకుని పది నిమిషాలు ఉండలేక పోయారని గుర్తు చేశారు. అక్కడ ప్రజలు 12 రోజులుగా ఎలా ఉంటున్నారో ఆలోచన చేయండని సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయితే బటన్ నొక్కుతారా అని నిలదీశారు. లక్షల మందికి డబ్బులు ఇచ్చామని గణాంకాలు చెబుతున్నారు కానీ... 75వేల మంది వరద బాధితులు లెక్కలు మీ దగ్గర లేవా అని ప్రశ్నించారు. వాలంటీర్‌లు, వైద్య బృందాలు, ప్రభుత్వ సిబ్బందిని ఎందుకు పంపలేదని క్వశ్చన్ చేశారు. 2వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరి పోతుందా... ప్రతిపక్షాలు ప్రజల్లో, అధికార పార్టీ ప్యాలెస్‌లో ఉంటుందని ఎద్దేవా చేశారు. 


పది రోజుల తరువాత జగన్ పర్యటనలో ఏ చెప్పాలో ప్రజలకు మంత్రి శిక్షణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు విష్ణువర్దన్ రెడ్డి. అంతా‌ బాగుందని, గొప్పగా చేశారని జగన్‌కు చెప్పాలా... మహిళల బాధలు ఒక్కసారి చూడండని అని బీజేపీ రికార్డు చేసిన సమస్యల వీడియోను మీడియా ముందు ప్లే చేశారు.  11రోజులుగా తిండి లేదు, గూడు లేదని ఆవేదన చెందుతున్నారన్నారు. ఇంత నిర్లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజల సొమ్ముతో, పన్నుతో బతుకుతూ... వారి బతుకులను బజారు పాలు చేస్తారా అని మండిప‌డ్డారు విష్ణు.


ఏపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారిందన్నారు విష్ణువర్దన్ రెడ్డి. ప్రణాళిక లేకుండా స్కూళ్లు మూసేస్తారా అని విష్ణు వ‌ర్దన్ రెడ్డి ప్రశ్నించారు. మూడు కిలో మీటర్లు వెళ్లి పిల్లలు చదువుకుంటారా, ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతారా అని నిలదీశారు. వీటిని వెలుగులోకి తెస్తే అన్యాయంగా కేసులు పెడతారా, సమస్యను పరిష్కారించే బాధ్యత ప్రభుత్వంపై లేదా అని అన్నారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. 


దేశం మొత్తం జాతీయ విద్యా విధానం అమలైతే.. ఏపీలో జగన్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తున్నారన్నారు విష్ణువర్దన్ రెడ్డి. జగన్ రివర్స్ పాలనకు ఇది పెద్ద ఉదాహరణగా అభిప్రాయపడ్డారు. పేదలకు విద్యను దూరం చేసే కుట్రతో ఇదంతా చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో అవకాశం ఇస్తుంటే.. జగన్ మాత్రమే ‌జాతీయ విద్యా విధానం ముసుగులో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. 


విదేశాల్లో కోట్లు పెట్టి మీ పిల్లలను చదివిస్తారు కానీ... కూటి కోసం కష్టపడే పేదల పాట్లు మీకు అర్ధం కావన్నారు విష్ణు. బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుంచి యువ సంఘర్షణ యాత్ర చేపడుతుందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా జగన్ మోసాలను వివరిస్తామన్నారు విష్ణు. ఈ ఏడాది పాఠశాలల విలీన ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. 


విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనను అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. జాతీయ విద్యా విధాన వ్యతిరేక చర్యలపై బిజెపి పోరాటం చేస్తుందన్నారు. పేదలకు బియ్యం ఇప్పించిన విధంగానే విద్యా విధానంలో కూడా మార్పు తెప్పిస్తామన్నారు. వైసిపి వైఫల్యాలపై బిజెపి ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళతామ‌ని ఆయ‌న వెల్లడించారు.