బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా.. నాగచైతన్య కీలకపాత్రలో తెరకెక్కిన సినిమా 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ దర్శకులను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 


ముందుగా ఆమిర్ ఖాన్ పెర్ఫార్మన్స్ గురించి గొప్పగా మాట్లాడారు చిరంజీవి. ఆమిర్ ఖాన్ మాదిరి నటించాలని ఉన్నా.. కొన్ని పరిధుల వలన తాము చేయలేకపోతున్నామని చిరు అన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకులకు క్లాస్ పీకారు చిరు. కొందరు దర్శకులు షూటింగ్ స్పాట్ లో అప్పటికప్పుడు డైలాగ్స్ ఇస్తున్నారని.. ఇది నటులను చాలా ఇబ్బంది పెట్టే విషయమని అన్నారు. తనకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చారు. 


స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు చాలా శ్రమించాల్సి ఉంటుందని.. మిగతా టెక్నీషియన్స్ కి కూడా కథ గురించి తెలిస్తే వారు పనిచేసే విధంగా వేరేలా ఉంటుందని.. అప్పుడు రిజల్ట్ కూడా బాగుంటుందని తెలిపారు. బహుశా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కి సీన్స్ తెలుసేమో కానీ.. అప్పుడే వచ్చిన కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మాత్రం తెలియదని.. అప్పటికప్పుడు డైలాగ్స్ చెప్పించడంతో వారు నటనలో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారని అన్నారు. 


ఏదో మెకానికల్ గా సీన్ చేసేసి వెళ్లిపోతున్నారని తన అభిప్రాయాన్ని చెప్పారు చిరు. సినిమాకి ముందు వర్క్ షాప్స్ చేయాలని.. ముందుగా డైలాగ్స్ అన్నీ చెప్పాలని.. అవి ప్రాక్టీస్ చేసి పెర్ఫెక్ట్ అనుకుంటేనే షూటింగ్ కి వెళ్లాలని చెప్పారు. అలా చేస్తే సెట్స్ కు వెళ్లిన తరువాత నా డైలాగ్ ఏంటి..? ఎలా గుర్తుంచుకోవాలి..? అనే విషయాలపై మనసు పెట్టక్కర్లేదని.. కేవలం నటన మీద ఫోకస్ చేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు. మరి టాలీవుడ్ లో ఈ పద్ధతి మారుతుందేమో చూడాలి!