తమిళ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘తంగలాన్’. ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు పా రంజిత్ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్​ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మాళవిక లుక్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఆమె ఒక్కసారి డీగ్లామర్ పాత్రలో కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు.

   


గిరిజన మహిళ కొండమ‌ల్లిగా మాళవిక


వాస్తవానికి లుక్ పరంగా హీరోయిన్లు ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వారిలో అనుష్క శెట్టి ముందుంటారు. పాత్ర డిమాండ్ చేస్తే బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా ఇట్టే రెడీ అవుతుంది. అందాలంతో కనువిందు చేయడంతో పాటు డీ గ్లామర్ పాత్రల్లోనూ నటించి మెప్పిస్తుంది. ఇక తాజాగా హీరోయిన్ మాళవిక మోహన్ కూడా లుక్ పరంగా కొత్త ప్రయోగం చేస్తోంది. తమిళ ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగళాన్’లో గిరిజన మహిళ కొండమ‌ల్లిగా కనిపించబోతుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆమె గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించింది. ఈ  సినిమాలో చియాన్ విక్ర‌మ్ గెట‌ప్, అత‌డితో పాటు ఉండే ఇతర ఆదివాసీల గెటప్ లు అందరినీ అశ్చర్యపరిచాయి. బ్రిటిషర్ల రాకనాటి రోజుల్లో గిరిజ‌న ఆట‌విక సంస్కృతిని తెర‌పై చూపించబోతున్నారు నటుడు పా రంజిత్. ఇందులో మాళవిక కూడా డీగ్లామరస్ పాత్రలో కనిపిస్తోంది. మాళవిక ఉన్నట్టుండి ఇలా దర్శనం ఇవ్వడంతో ఎవరూ గుర్తు పట్టడం లేదు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి మాళవిక ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా టీజర్​లో ఆమె రూపం చూసి అందరూ వణికిపోతున్నారు. గిరిజన పోరాటయోధురాలిగా గర్జిస్తూ కనిపించింది. విక్రమ్ పాత్రకు దీటుగా మాళవిక పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.



జనవరి 26న ‘తంగలాన్’ విడుదల


‘తంగలాన్’ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోంది. దేశంలోకి  బ్రిటిషర్ల రాక సమయంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో గిరిజ‌న జాతుల పాత్ర‌లే దర్శనం ఇవ్వనున్నాయి. తాజా టీజర్ లో విక్ర‌మ్, మాళ‌విక లుక్స్ కిర్రాక్ అని చెప్పుకోవచ్చు. టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక 'తంగలాన్' సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Read Also: ఆ నిర్ణయంతో నా హృదయం బద్ధలైంది, సుశాంత్​తో బ్రేకప్ గురించి ఎట్టకేలకు నోరు విప్పిన అంకిత!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial