తెలుగు సినీ ప్రేక్షకులకు హంస నందిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘లౌక్యం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. జక్కన్న తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించింది. పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది?’ చిత్రంలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.


ఏడాది క్రితం క్యాన్సర్ సోకినట్లు వెల్లడి


వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంస, గతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణాంతక వ్యాధి సోకినట్లు చెప్పింది. తన రొమ్ముకు చిన్న గడ్డలాంటిది కావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేసుకున్నట్లు వివరించింది. టెస్టుల అనంతరం తనకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు వైద్యులు వెల్లడించారన్నది. అయితే, తనకు ఈ వ్యాధి జన్యుపరంగా వచ్చినట్లు చెప్పింది. తన తల్లి కూడా ఇదే జబ్బుతో చనిపోయినట్లు చెప్పింది. తాను క్యాన్సర్ ను జయిస్తానని వివరించింది.


క్యాన్సర్ నుంచి కోలుకున్న హంస


హంస గత ఏడాదిన్నరగా క్యాన్సర్ కు చికిత్స తీసుకుంది. వరుసగా కీమో థెరఫీ చేయించుకుంది. వైద్యుల సమక్షంలో చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంది. వైద్యులు సూచించిన విధంగానే వ్యాధి నయం అయ్యేందుకు కచ్చితమైన చికిత్సను అందుకుంది. మొత్తంగా తను తీసుకున్న వైద్యం ఫలించింది. క్యాన్సర్ నుంచి హంస పూర్తిగా కోలుకుంది. ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా జయించింది.


షూటింగ్ సెట్స్ లో హంస సందడి!


గత రెండేళ్లుగా క్యాన్సర్ కారణంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక తాజాగా హంస ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నది. తన షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్ ను జయించిన హంసకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపై సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు. గతంలో మాదిరిగానే మళ్లీ ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నారు.






క్యాన్సర్ ను జయించిన పలువురు హీరోయిన్లు


హంస నందిని మాత్రమే కాదు, ఇప్పటికే పలువురు హీరోయిన్లు క్యాన్సర్ ను జయించారు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కోయిరాలాకు క్యాన్సర్ సోకింది. 2012లో తనకు వ్యాధి సోకాక, సినిమాలకు దూరమై చికిత్స తీసుకుంది. వ్యాధి నుంచి కోలుకున్నాక మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టింది. మరో హీరోయిన్ సోనాలి బింద్రేకు కూడా క్యాన్సర్ వచ్చింది. అమెరికాలో మెరుగైన చికిత్స తీసుకుంది. అక్కడ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ లిస్టులో ప్రస్తుతం హంస నందిని కూడా చేరింది.  


Read Also: 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది తారల హవా, టాప్ 10లో ఆరుగురు మనోళ్లే!