టాలీవుడ్ లో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు. చాలా తక్కువ సమయంలో 50 సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు అల్లరి నరేష్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టేవారు. ఆడియన్స్ కూడా అతడి సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవారు. కానీ కొంతకాలంగా ఆయన కామెడీ వర్కవుట్ అవ్వడం లేదు. దీంతో ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.

ఈ విషయం గ్రహించిన అల్లరి నరేష్ తన రూటు మార్చుకున్నారు. విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. 'మహర్షి' సినిమాలో సీరియస్ రోల్ పోషించిన అల్లరి నరేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలానే 'నాంది' సినిమాతో భారీ హిట్టు కొట్టారు. ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లే జాగ్రత్తగా సినిమాలను ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాలో నటిస్తున్నారు. 

 

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీమ్ నందమూరి బాలకృష్ణను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ బాలయ్య తిరిగి కోలుకొని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లి బాలయ్య కలిశారు నరేష్ అండ్ కో. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఈ ఫొటోల్లో బాలయ్య లుక్ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఆయన ఓల్డ్ లుక్ ను రిలీజ్ చేశారు #NBK107 మేకర్స్. కానీ ఇందులో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.