ఎప్పుడైనా సరే ఎన్నికలకు సిద్ధం..
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భాజపా భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణకు వచ్చానని చెప్పిన ఆయన..అప్పుడే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేంటో తెలుసుకున్నానని చెప్పారు. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, భాజపానే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసమే తెరాస పార్టీ ఆవిర్భవించిందని తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. నీళ్లు అందాయా, నిధులు అందాయా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడుకోవటమే అనవసరమంటూ ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. యువకులకు ఉద్యోగాలిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ దృష్టిలో యువతకు ఉద్యోగాలంటే కేవలం కేటీఆర్‌కి ఉద్యోగం (మంత్రి పదవి) ఇవ్వటమేనని సెటైర్లు వేశారు. యువత ఉద్యోగాల గురించి ఆయన పట్టించుకోరని, కేవలం తన కొడుకుని సీఎం చేసేందుకు మాత్రమే రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. ఆయనకు రాష్ట్ర ప్రజల గురించి ఎలాంటి బాధా లేదని అన్నారు.
ఈసారి అధికారం మాదే..
ఈ సారి కేసీఆర్‌కు గానీ, ఆయన కొడుకుకి గానీ అవకాశం రాదని..కేవలం భాజపా మాత్రమే అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు. ఎప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి భాజపా తెలంగాణ ప్రజలకు మద్దతుగా నిలబడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల పాటు ఈ డిమాండ్‌ను పక్కన పెట్టేసిందని విమర్శించారు. 2014లో ప్రధాని మోదీ వచ్చే నాటికి ఏపీ విభజన జరిగిపోయిందని
ఈ రెండు రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరపకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని అన్నారు. అటల్ హయాంలోనే ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విభజన జరిగిందని చెప్పారు. కానీ ఆ రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని..కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా విభజన చేసిందని విమర్శించారు. తెరాస కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఓవైసీ లాంటి వ్యక్తుల చేతికి స్టీరింగ్ అందిస్తే ప్రజలకు మేలు జరుగుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కేసీఆర్ హైదరాబాద్ విమోచన్ దినోత్సవం జరుపుతామని అన్నారు. కానీ ఆయన ఎప్పుడూ ఈ విషయంపట్టించుకోలేదని అన్నారు. ఓవైసీకి భయపడే విమోచన దినోత్సవం జరపటం లేదని విమర్శించారు. ఒక్కసారి మోదీ నేతృత్వంలోని భాజపాను గెలిపించమని ప్రజల్ని విజ్ఞప్తి చేసిన అమిత్‌షా, తాము విమోచన దినోత్సవం జరుపుతామని, ఈ విషయంలో ఎవరికీ భయపడమని స్పష్టం చేశారు.
తాంత్రికుడి మాటలు విని సచివాలయానికి రావట్లేదు..
ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లారా అని ప్రశ్నించారు. సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని ఎవరో తాంత్రికుడు చెప్పాడని అందుకే కేసీఆర్ రావటం లేదని అన్నారు. తాంత్రికుల మాటలు నమ్మి, సచివాలయానికి రాని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లాల్సిన పని లేదని, ఈ సారి భాజపా ముఖ్యమంత్రి వెళ్లి సీఎం కుర్చీలో కూర్చుంటారని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో భాజపా పాలిత రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన, తెలంగాణలో మాత్రం యువతకు ఈ ప్రగతి కనిపించటం లేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు లభించటం లేదని, పరిశ్రమలు రావటం లేదని విమర్శించారు. దేశమంతా ముందుకు వెళ్తుంటే, తెలంగాణ మాత్రం వెనకబడిపోతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు మంచిది కాదన్న ఆయన, భాజపాకు అవకాశమిచ్చి తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. తెరాస నెరవేర్చని హామీలన్నింటినీ భాజపా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.