మందార పూలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. ఇంటి ఆవరణలో ఉంటే ఆ అందమే వేరు. అవి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అన్ని సుగుణాలను కలిగి ఉంటాయి.ఈ పూలను ఆయుర్వేదంలో రకరకాల ఔషధాల్లో వినియోగిస్తారు. దానికి కారణం జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు ఇది చెక్ పెట్టగలదు. అందుకే మందార పూల మొక్కలను మీ పెరట్లో ఉండేట్టు చూసుకోండి. ఆ ఆకులను పేస్టులా చేసుకుని వారానికోసారి తలకు పట్టించుకుంటే చాలా మంచిది. లేదా ఆ ఆకులతో తైలంగా చేసుకుని సీసాలో వేసుకుని దాచుకోవాలి. అప్పుడప్పుడు రాసుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి.
మందార తైలం తయారీ ఇలా...
మందాల ఆకులను మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి రసం తీయాలి. ఈ రసం ఎంతుందో అంతే పరిమాణంలో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని మందపాటి గిన్నెలో వేసి చిన్న మంట మీద స్టవ్ పై పెట్టాలి.అందులోని రసం ఆవిరైపోయి నూనె మిగిలే వరకు ఉంచాలి. చల్లబడేదాకా ఉంచి ఆ తైలాన్ని వడకార్చి ఒక సీసాలో వేసుకోవాలి. ఈ తైలాన్ని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి. పేనుకొరుకుడు సమస్య కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. సమస్యా ఉన్నా లేకపోయినా ఈ తైలాన్ని వాడడం వల్ల భవిష్యత్తులో జుట్టు రాలదు.
కొత్త జుట్టు వచ్చేందుకు...
చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. అనారోగ్యం వల్ల కాకుండా పోషకాహారలోపం వల్లో లేక సరిగా పోషణ లేకో జుట్టు ఊడిపోతుంటే మాత్రం... ఆ పరిస్థితికి మందార తైలం చెక్ పెడుతుంది. అలాంటి వారు రోజూ మందార తైలం రాస్తుంటే కొత్త జుట్టు మొలుస్తుంది. కొందరి చిన్న పిల్లలకు జుట్టు తెల్లబడిపోతుంది. అలాంటివారికి కూడా తైలం బాగా పనిచేస్తుంది. మందార పూలను పేస్టులా చేసి రాసినా మంచి ఫలితం ఉంటుంది. నెల రోజుల పాటూ తైలాన్ని క్రమం తప్పకుండా వాడితే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. బట్టతల రావడం కూడా తగ్గుతుంది. మందార ఆకులు కేవలం జుట్టుకే కాదు శరీరానికీ ఎంతో మేలు చేస్తాయి. మందార ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగితే మలబద్ధకం సమస్య పోతుంది.
Also read: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే
Also read: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?