పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇక వెబ్ సిరీస్ లైతే వందల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ఒరిజినల్ కంటెంట్ కోసం బాగా ఖర్చు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. తెలుగులో కూడా పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారు. పేరున్న దర్శకులు చాలా మంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. 

 

ఇప్పుడు కృష్ణవంశీ వంతు వచ్చింది. త్వరలోనే ఆయన ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల రూ.300 కోట్ల వరకు ఉంటుంది. ఇదొక బ్లాస్ట్ లాంటి ప్రాజెక్ట్ అని.. త్వరలోనే వివరాలు చెబుతానని అన్నారట. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ని నమ్మి మూడొందల కోట్ల బడ్జెట్ పెట్టడమంటే మాములు విషయం కాదు. కాకపోతే ఓటీటీలతో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. 

 

అక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు. ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మూడొందల కోట్లు పెద్ద మేటర్ కూడా కాదు. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'రంగమార్తాండ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి తారలు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'అన్నం' అనే సినిమాను రూపొందించనున్నారు కృష్ణవంశీ.