భారీ అంచనాలున్న తమిళ సినిమా ‘వారిసు’ ఆడియో లాంచ్ డిసెంబర్ 24వ తేదీన చెన్నైలో జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మెగా ఈవెంట్‌లో అతిపెద్ద హైలైట్‌గా హీరో విజయ్ ప్రసంగం నిలిచింది. ఆ తర్వా విజయ్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ ద్వారా ‘వారిసు’ ఆడియో లాంచ్‌కు హాజరైన ప్రేక్షకులతో ఒక సెల్ఫీ వీడియోను దిగి షేర్ చేశారు.


సోషల్ మీడియాలో విజయ్ అంత యాక్టివ్‌గా ఉండరు. కానీ ఈసారి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ‘వారిసు’ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులతో తీసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. తన అభిమానులు, ప్రేక్షకులు ప్రేమతో విజయ్ ఎంతో ఆనందించారు. తన సిగ్నేచర్ లైన్ "ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్" ('నా హృదయంలో నివసించే వారికి' అని అర్థం)ను వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 2.8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


విజయ్ ఏం మాట్లాడారు?
‘వారిసు’ ఆడియో లాంచ్‌లో ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్, ఇతర తారాగణం, సినిమా టీంతో కలిసి పని చేయడం గురించి కూడా ఓపెన్ అయ్యారు. వివేకానందుని మాటలతో ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. అజిత్ కుమార్ సినిమా ‘తునివు’తో పోటీ గురించి పరోక్షంగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభం నుంచి ‘నాతో నాకే’ పోటీ అని చెప్పారు.


దిల్ రాజుపై కామెడీ
నిర్మాత దిల్ రాజు గురించి మాట్లాడుతూ ఆయన ఇంటికి ఇటీవలే ‘వారిసు (వారసుడు)’ వచ్చాడన్నారు. ఆ తర్వాత నవ్వుతూ ‘వారిసు 2 ఎప్పుడు సార్?’ అని అడగ్గా స్టేడియం అంతా నవ్వులతో మునిగి తేలింది. వెంటనే నవ్వుతూ తాను సినిమా సీక్వెల్ గురించి అడిగానన్నారు.


‘వారిసు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ప్రచారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నైలోని మెట్రో రైళ్లను సైతం ప్రచారం కోసం వాడేస్తున్నారు. ఇందుకు చెన్నై మెట్రో ట్రైన్ అంతటా ‘వారిసు’ సినిమా పోస్టర్లతో నింపేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ చెన్నైలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది మూవీ టీమ్.
 
హీరో విజయ్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ‘తుపాకీ’ సినిమా నుంచి విజయ్ సినిమాలు అన్నీ తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తెలుగులో తన పాపులారిటీని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే తెలుగు దర్శక నిర్మాతలతో కలసి సినిమా చేస్తున్నారు. ‘వారసుడు’ సినిమాతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు విజయ్.