బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి గల కారణాలపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా ఇప్పటికీ ఏం తేల్చలేకపోతోంది. 3 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయినా, విచారణ పేరుతో ఏండ్లు గడుస్తున్నా, అసలు విషయంపై క్లారిటీ రావడం లేదు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ బృందం ఆయన మరణానికి గల కారణాలను అన్వేషిస్తూనే ఉంది. 2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనది హత్య అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది. ఆయన మృతికి కారణాలు తెలుసుకునేందుకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది.

  


గూగుల్, ఫేస్ బుక్ డేటా కోసం ఎదురుచూస్తున్న సీబీఐ


సుశాంత్  మరణానికి సంబంధించిన కారణాలపై స్పష్టత కోసం సోషల్ మీడియాలో ఆయన డిలీట్ చేసిన పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు తెలిస్తే ఆయన మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని  భావిస్తున్నారు.  డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు టెక్ సంస్థలు అయిన గూగుల్, ఫేస్‌బుక్ ను 2021లోనే సీబీఐ అధికారులు సంప్రదించారు. సుశాంత్ డిలీట్ డేలా ఇవ్వాలని కోరారు. అయితే, ఆ సంస్థల నుంచి వచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే డేటా ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. 


MLAT ప్రకారం వివరాలను కోరిన సీబీఐ


సుశాంత్ సింగ్ డిలీట్ డేటా కోసం భారత దేశీయ నేర పరిశోధనా సంస్థ  సిబిఐ  యునైటెడ్ స్టేట్స్‌ ను ఆశ్రయించింది. MLAT (పరస్పర న్యాయ సహాయ ఒప్పందం)  ప్రకారం కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్న Google, Facebook నుంచి CBI సమాచారాన్ని కోరింది. సుశాంత్ డిలీటెడ్  చాట్‌లు, ఇమెయిల్స్, పోస్టుల వివరాలను అందివ్వాలని అభ్యర్థించింది. అయితే, ఆ సంస్థల నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.


సుశాంత్ కేసుపై దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు


ఇక రీసెంట్ గా  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై  మహారాష్ట్ర హోంమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  “సుశాంత్ మృతి కేసులో స్థానికులు, అప్పటికి అందుబాటులో ఉన్న వారు చెప్పిన మాటల ఆధారంగా  కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత కొంతమంది సుశాంత్ మరణానికి సంబంధించి తమ వద్ద కీలక సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడించారు.  వారు చెప్పిన వివరాలను సేకరించారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటిలో నిజా నిజాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున మరిన్ని వివరాలు చెప్పలేకపోతున్నాం” అని తెలిపారు.   






Read Also: సంక్రాంతి బరిలో ‘హనుమాన్’, ఫ్రెష్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!