Mahila Samman Savings Crtificate Scheme: మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి ఇకపై పోస్టాఫీసును వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. ఇప్పటి వరకు పోస్టాఫీసులకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు బ్యాంకులకూ వర్తింపజేశారు. వీలైనంత ఎక్కువ మందికి ఈ స్కీమ్‌ను చేరువ చేయడం ఈ డెసిషన్‌కు కారణం. ఇకపై అన్ని ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ ఖాతాను తెరవొచ్చు.


ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ ప్రారంభమైంది. ఇది.. మహిళలు, బాలికల కోసమే తీసుకొచ్చిన స్పెషల్‌ స్కీమ్‌. స్టార్టయిన మూడు నెలల్లోనే (ఏప్రిల్‌-జూన్‌) దీనికి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటివరకు, 1.026 మిలియన్ల మందికి (10 లక్షల మంది) పైగా మహిళలు/బాలికలు 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌' కింద అకౌంట్స్‌ ఓపెన్‌ చేశారు, రూ. 6,000 కోట్లకు పైగా డబ్బును జమ చేశారు. 


ఇకపై బ్యాంకుల్లోనూ అందుబాటులోకి ఈ స్కీమ్‌
ఈ స్కీమ్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తుండడంతో, దీనిని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టార్ట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ-గెజిట్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ-గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం, అన్ని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ను నిర్వహిస్తాయి. వీటితో పాటు, కొన్ని సెలెక్టెడ్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తాయి. ఇప్పుడు... మహిళలు/బాలికలు తమకు దగ్గర్లోనే ఉన్న బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చు, స్కీమ్‌ బెనిఫిట్స్‌ పొందొచ్చు.


ఈ ఉమెన్‌ స్పెషల్‌ స్కీమ్‌ పోస్టాఫీస్‌లతో పాటు బ్యాంకులకు కూడా ఎక్స్‌టెండ్‌ కావడంతో, రాబోయే రోజుల్లో ఈ పథకం రీచ్‌ పెరుగుతుందని, అకౌంట్‌ ఓపెన్‌ చేసే వాళ్ల సంఖ్య, పెట్టుబడి మొత్తం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 


మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ వివరాలు:
ఇది రెండేళ్ల డిపాజిట్‌ స్కీమ్‌. పెట్టుబడిపై ఏటా 7.5 శాతం వడ్డీ (Mahila Samman Crtificate Saving Scheme Interest Rate) చెల్లిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద మహిళలు/బాలికలు మాత్రమే ఖాతా స్టార్ట్‌ చేయగలరు. మైనర్‌ బాలికల బదులు వాళ్ల తల్లిదండ్రులు/గార్డియన్స్‌ అకౌంట్ ఓపెన్‌ చేయవచ్చు. మార్చి 31, 2025 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.


మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అకౌంట్‌లో కనిష్టంగా రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడిపై వచ్చే 7.5 శాతం వార్షిక వడ్డీని ప్రతి త్రైమాసికం తర్వాత ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు. అకౌంట్‌ మెచ్యూరిటీ తర్వాత, ఫారం-2ను పూరించి అకౌంట్‌లోని డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ గడువుకు ముందే డబ్బును వెనక్కు తీసుకోవాలంటే, అకౌంట్‌ ప్రారంభించిన ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత విత్‌ డ్రా చేయవచ్చు. అప్పుడు, ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.


CBDT నోటిఫికేషన్ ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయంపై TDS పడుతుంది. అయితే, వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో TDSకు బదులుగా, ఆ వడ్డీ ఆదాయం అకౌంట్‌ హోల్డర్‌ మొత్తం ఆదాయానికి యాడ్‌ అవుతుంది. రిటర్న్‌ ఫైల్‌ చేసే సమయంలో ఇన్‌కమ్‌ స్లాబ్ సిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 


మరో ఆసక్తికర కథనం: పసిడి వెలుగు స్థిరం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial