సూర్య.. తమిళ టాప్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన గురించి తెలియని వారు ఉండరని చెప్పుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలోనూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ‘సూర్య 42’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
వారియర్ గా సూర్య
తాజాగా (సెప్టెంబర్ 9) ఈ సినిమా యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. చడీ చప్పుడు లేకుండా ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. విజువల్ వండర్ గా రూపొందిన ఈ మోషన్ పోస్టర్ సినీ లవర్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నది. యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తుంది. నెమ్మదిగా సూర్య భుజం మీద వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. చేతిలో ఆయుధాలతో సూర్య యుద్ధ పరాక్రమవంతుడిగా కనిపిస్తున్నారు. సినీ అభిమానులు సూర్య 42 సినిమా మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ గా భావిస్తుండగా.. ఈ మోషన్ పోస్టర్ చూశాక అదంతా అవాస్తవం అని తేలింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాగా అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఉంది.
చెన్నై, గోవాలో భారీ సెట్లు
అటు ఈ సినిమాను 3డీ లో రూపొందిస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. 10 భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సూర్యను ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త క్యారెక్టర్ లో దర్శకుడు శివ చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. సూర్య42 సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ హీరోయిన్ గా చేస్తుంది. వెట్రి ఫలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిలాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైతో పాటు గోవాలో భారీ సెట్లు వేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక సూర్య చివరి సారిగా విజయ్ సేతుపతి, కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. 2022లో సూర్య నటించిన సినిమా ఎతర్క్కుమ్ తునింధవన్. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?