సినిమా రివ్యూ : కెప్టెన్
రేటింగ్ : 2/5
నటీనటులు : ఆర్య, ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్, మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, ఆదిత్యా మీనన్ తదితరులు
మాటలు : రాకేందు మౌళి (తెలుగులో)
పాటలు : రామజోగయ్య శాస్త్రి (తెలుగులో)
సినిమాటోగ్రఫీ :  ఎస్. యువ
సంగీతం: డి ఇమాన్ 
సమర్పణ : ఉదయనిధి స్టాలిన్ 
నిర్మాణం : ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడ‌క్ష‌న్స్‌ 
తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్
రచన, దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 8, 2022


'రాజా రాణి'తో తమిళ హీరో ఆర్య (Arya) తెలుగులో భారీ విజయం అందుకున్నారు. అంతకు ముందు 'వాడు వీడు', 'నేను దేవుడ్ని' వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా... 'రాజా రాణి' కమర్షియల్ విజయం అందించింది. ఆ 'నేనే అంబాని' చిత్రంతోనూ మంచి విజయం అందుకున్నారు. ఓటీటీ సినిమా 'సార్‌ప‌ట్ట‌' సూపర్ సక్సెస్ సాధించింది. ఈ రోజు 'కెప్టెన్' (Captain Movie 2022) అంటూ థియేటర్లలోకి వచ్చారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా (Captain 2022 Review) ఎలా ఉంది?


కథ (Captain Movie Story) : ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు(నార్త్ ఈస్ట్ బోర్డర్)లో గల సెక్టార్ 42కి ఆర్మీ ఎంత మంది సైనికులను పంపించినా... ఎవరు ప్రాణాలతో ఉండరు. పోస్టుమార్టంలో రిపోర్టులో వెళ్లిన సైనికుల బృందంలో ఒకరు మిగతా వాళ్లను షూట్ చేసినట్లు తెలుస్తుంది. కెప్టెన్ విజయ్ కుమార్ (ఆర్య) అండ్ టీమ్ సెక్టార్ 42కి వెళ్లినప్పుడు వాళ్ల బృందంలో ఒకరు షూట్ చేసుకుని మరణిస్తారు. అయితే, విజయ్ అండ్ టీమ్‌కు ఏమీ కాదు. సైంటిస్ట్ కీర్తి (సిమ్రాన్) మళ్ళీ విజయ్ బృందాన్ని సెక్టార్ 42కి తీసుకువెళుతుంది. ఆ తర్వాత ఆ ఏరియాలో మినటార్స్ (వింత జీవులు / క్రియేచర్స్) ఉన్నయని, సైనికుల మరణాలకు అవే కారణం అని తేలుతుంది. అసలు సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా, ఇతరుల్ని షూట్ చేసేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? వాటిపై కీర్తీ ఎటువంటి పరిశోధన చేశారు? విజయ్ టీమ్‌ను మళ్ళీ సెక్టార్ 42కి ఆమె తీసుకు వెళ్లడానికి కారణం ఏంటి?మినటార్స్‌ను అంతం చేయడం కోసం విజయ్ ఏం చేశారు? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Captain Review) : 'కెప్టెన్' ప్రచార చిత్రాలు ఆసక్తి కలిగించాయి. వింత జీవులు, వాటిని అంతం చేయడానికి కథానాయకుడు చేసే సాహసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హాలీవుడ్‌లో ఈ జానర్ సినిమాలు ఎక్కువ. ఇండియన్ స్క్రీన్ మీద అసలు రాలేదు. మ్యాన్ వర్సెస్ క్రియేచర్ కాన్సెప్ట్‌లో తీసిన ఫస్ట్ సినిమా 'కెప్టెన్' కావడంతో ప్రేక్షకుల దృష్టి పడింది. సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే... 


'కెప్టెన్' పోస్టర్లు, ట్రైలర్ చూసినప్పుడు 'ప్రిడేటర్'లా ఉందని అనిపిస్తుంది. సినిమా చూశాక... దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్‌లో మ్యాన్ వర్సెస్ క్రియేచర్ జానర్‌లో వచ్చిన చిత్రాలు చూసి కథ రాసుకున్నట్లు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు. పోనీ, ఆ కథను అయినా ఆసక్తిగా ముందుకు తీసుకు వెళ్ళారా? అంటే అదీ లేదు. కమర్షియల్ ఫార్ములాలో వెళ్లిపోయారు.


తన టీమ్‌లో మిగతా వాళ్లను కుటుంబంలా భావించే ఒక కెప్టెన్, టీమ్‌మేట్‌ మరణంతో కుంగిపోవడం వంటి రొటీన్ సీన్స్‌తో కథను ముందుకు తీసుకు వెళ్లారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి క్యారెక్టర్ ట్విస్ట్ ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. సైంటిస్ట్ క్యారెక్టర్‌ను చూపించిన తీరు బాలేదు. 


పెళ్లి చూపులకు వెళ్లనని హీరో అంటే... టీమ్‌లో లేడీ 'ఫస్ట్ టైమ్ కష్టపడి శారీ కట్టుకున్నాను, ప్లీజ్!' అంటుంది. అప్పుడు హీరో 'సరే' అని వెళతాడు. టీమ్‌మేట్‌ శారీ కట్టుకుందని పెళ్లి చూపులకు వెళ్లడం ఏంటి? అసలు అర్థం కాదు. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు... వాళ్లను తీసుకు రావడానికి వెళ్లిన సైనికులకు ఏమీ కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం కూడా అర్థం కాదు. సినిమాలో లాజిక్ లేని ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. హీరో విషయంలో మాత్రం ఒక లాజిక్ ఫాలో అయ్యారు. దానికి అభినందించాలి. 


రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా దర్శకుడు... ఇంటర్వెల్, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా పర్వాలేదనిపించారు. క్రియేచర్ డిజైన్ ఓకే. విజువల్స్ చూస్తే... వీఎఫ్ఎక్స్ విషయంలో బడ్జెట్ సహకరించలేదని క్లారిటీగా తెలుస్తుంది. మ్యూజిక్ పరంగా డి ఇమాన్ ఆకట్టుకుంటారు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్నది ఒక్కటే పాట. దానికి మంచి మెలోడీ అందించారు. 


నటీనటులు ఎలా చేశారు? : కెప్టెన్‌కు కావాల్సిన ఫిట్‌నెస్‌, ఫిజిక్ హీరో ఆర్యలో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ (ఉన్నవి తక్కువ అనుకోండి, ఉన్నంతలో) ఆయన బాగా చేశారు. అయితే, నటుడిగా ఆయన నుంచి ఎక్కువ ఆశించకండి. ఎందుకంటే... కథ గానీ, క్యారెక్టర్ గానీ అందుకు సపోర్ట్ చేయలేదు. ఐశ్వర్య లక్ష్మీది అతిథి పాత్ర. ఒక పాట, రెండు సన్నివేశాల్లో కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆదిత్యా మీనన్, హరీష్ ఉత్తమన్ వంటి నటీనటుల పాత్రల నిడివి కథలో పరిమితమే. ఇక, సిమ్రాన్ విషయానికి వస్తే... పెర్ఫార్మన్స్ చూపించే స్కోప్ ఆమెకూ దక్కలేదు. సైంటిస్ట్‌గా ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. మిగతా వాళ్ళను గుర్తు పెట్టుకోవడం కష్టం.     


Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : హాలీవుడ్ రేంజ్ సినిమా ఆశించి థియేటర్లకు వెళితే తప్పకుండా డిజప్పాయింట్ అవుతారు. అసలు అంచనాలు పెట్టుకోకుండా వెళ్లినా సరే 'కెప్టెన్' ఆకట్టుకోవడం కష్టం. వావ్ మూమెంట్స్ ఏమీ ఉండవు. అయితే... సెకండాఫ్‌లో కొన్ని సీన్స్, ట్విస్ట్‌లు పర్వాలేదు. కథానాయకుడిగా, నిర్మాతగా ఆర్య గురి తప్పిందనిపిస్తుంది. డిఫ‌రెంట్‌గా చేయాలనే ఆయన ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా అభినందించాలి. 


Also Read : ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ: అనుదీప్ కథ ఆకట్టుకుంటుందా? జాతి రత్నాలు స్థాయిలో ఉందా?