తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దేశవ్యాప్తంగా ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బాషా’ సినిమా ఒకటి. ఈ మూవీ 1995 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్వకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ లో డైలాగ్స్, ఫైట్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ముఖ్యంగా ‘బాషా ఒక్కసారి చెప్తే.. వంద సార్లు చెప్పినట్టే’ వంటి డైలాగ్ లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. ఈ సినిమాతో రజనీకాంత్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. అంతటి చరిత్ర సృష్టించిన ఆ మూవీను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రిమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. ‘బాషా’ రీమేక్ మూవీలో రజినీకాంత్ ఉండరట. 


ఈ ‘బాషా’ రీమేక్ ను దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కించబోతున్నారట. మూల సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళంలో మళ్లీ ఈ మూవీను రీమేక్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో గా అజిత్ ను అనుకుంటున్నారని టాక్. గతంలో కూడా దర్శకుడు విష్ణువర్థన్ రజనీకాంత్ నటించిన ‘బిల్లా’ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాను అదే పేరుతో విడుదల చేశారు. ఇందులో హీరోగా అజిత్ నటించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. అందుకే ఈసారి బాషా సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించారట దర్శకుడు విష్ణువర్థన్. ఇందులో కూడా హీరోగా అజిత్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ‘బాషా’ సినిమా అంటేనే వెంటనే రజనీకాంత్ గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం ఓ  రేంజ్ లో ఉంటాయి. మరి ఇన్నేళ్ల తర్వాత ఆయన ప్లేస్ లో అజిత్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అజిత్ అంత సాహసం చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. 


ఇక అజిత్ ఈ ఏడాది ప్రారంభంలో ‘తునివు’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అజిత్ తన 62 వ చిత్రానికి సిద్దమయ్యారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ తప్పుకున్నారట. కథలో అజిత్ చెప్పిన మార్పులకు ఆయన ఒప్పుకోకపోవడమే ఇందుకు కారణం అని టాక్. అయితే ఇది కాకుండా మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో అజిత్ ఓ సినిమాలో నటించబోతున్నారు అని సమాచారం. ఈ సినిమా తర్వాత అజిత్ విష్ణు వర్థన్ దర్శకత్వంలో ‘బాషా 2’ సినిమాలో నటిస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్