Pan-Aadhaar Link: మన దేశంలో 61 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. వీళ్లందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్‌తో ఆధార్ సంఖ్యను అనుసంధానించడాన్ని (PAN Aadhaar Link) కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
అయితే, ఈ 61 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో కేవలం 48 కోట్ల మంది తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించారు. పాన్ - ఆధార్‌ను లింక్ చేయని వాళ్లు ఇంకా 13 కోట్ల మంది ఉన్నారు. ఈ ఏడాది (2023 )మార్చి 31 గడువు లోగా పాన్ - ఆధార్ నంబర్‌ను లింక్ చేయని వాళ్లు ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు, పాన్ కార్డ్ సంబంధిత ప్రయోజనాలను వాళ్లు పొందలేరు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes - CBDT) చైర్ పర్సన్ నితిన్ గుప్తా ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. వీలైనంత త్వరగా పాన్- ఆధార్ నంబర్ అనుసంధానాన్ని పూర్తి చేయాలని తాము ఎప్పటికప్పుడు ప్రజలకు సలహా ఇస్తున్నామని చెప్పారు.
ఇంతకు ముందు, పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌లను లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు పొడిగించింది. తాజాగా ఇచ్చిన గడువు మార్చి 31, 2023. ఈ గడువులోగా పాన్ - ఆధార్‌లను లింక్ చేయకపోతే పాన్ కార్డ్ నిరుపయోగంగా (ఇన్ ఆపరేటివ్) మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేరు. దీంతో పాటు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పటికే బ్యాంక్ ఖాతా ఉన్నా, రూ.50 వేలు దాటిన లావాదేవీలకు బ్యాంకులు పాన్ నంబర్‌ను తప్పనిసరి చేశాయి. ఈ విధంగానూ ఇబ్బంది ఎదురు కావచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఉపయోగించే డీమ్యాట్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయలేరు.
ఇప్పుడు వెయ్యి - తర్వాత రూ.10 వేలు
మీరు ఇప్పటి వరకు మీ పాన్‌న ఆధార్ నంబర్‌తో లింక్ చేయకుంటే, కోరికోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఇప్పుడే ఆ రెండింటి అనుసంధానం పూర్తి చేయండి, ఆ ప్రక్రియ చాలా సులభం. ఈ అనుసంధానం గతంలో ఉచితం, ఇప్పుడు కొంత అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ్టి నుంచి 2023 మార్చి 31వ తేదీ లోపు మీరు మీ పాన్ - ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తే రూ. 1,000 అపరాధ రుసుము (లేట్ ఫీజ్) చెల్లించాలి. ఒకవేళ, 2023 మార్చి 31 తర్వాత పాన్ - ఆధార్ నంబర్‌ను లింక్ చేస్తే అప్పుడు మీరు చెల్లించాల్సిన పైన్ 10 వేల రూపాయలు. కాబట్టి ఇప్పుడే మీ పాన్‌ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించండి. ఆ పక్రియను సులభంగా ఎలా పూర్తి చేయాలో మేం మీకు వివరిస్తాం.
లేట్ ఫీజ్ చెల్లించి, పాన్-ఆధార్ లింకేజ్ ఎలా పూర్తి చేయాలి?
పాన్ - ఆధార్ లింకేజీ కోసం egov-nsdl.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
ఇందులో Tax applicable - (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత Other Receipts ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ పాన్, అసెస్‌మెంట్ ఇయర్, పేమెంట్ మెథడ్, అడ్రస్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ వంటి వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలన్నీ ఇవ్వాలి.
ఇప్పుడు, కింద కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
మీరు కట్టిన లేట్ ఫీజ్‌ను ఓకే చేయడానికి 5 రోజుల వరకు సమయం పడుతుంది.
ఆ తర్వాత ఐటీ విభాగం ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, పాన్ - ఆధార్ అనుసంధానం పూర్తి చేయవచ్చు.