"విఠలాచార్యగారు గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాత. ఆయన ఎంతో వేగంగా చిత్రాలు తీసేవారు. దర్శక - నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు" అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారు. విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి 'జై విఠలాచార్య' అని పేరు పెట్టారు. 'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా ప్రచురిస్తున్న ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ "కాంతారావు గారు హీరోగా విఠలాచార్య గారు చాలా జానపద చిత్రాలు చేశారు. కాలేజీ రోజుల్లో అవి చూసేవాడిని. హీరో అయిన తర్వాత ఆయన దర్శకత్వంలో నేను 'ఇద్దరు మొనగాళ్లు' చేశా. అది హిట్. నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేయడం వల్ల జానపద నేపథ్యంలో తక్కువ చిత్రాలు చేశా. నేను నటించిన తొలి మల్టీస్టారర్ కూడా 'ఇద్దరు మొనగాళ్లు'. విఠలాచార్యగారిలో గొప్ప విషయం ఏంటంటే... బడ్జెట్‌లో సినిమా పూర్తి చేసేవారు. దర్బార్ సెట్ వేస్తే... అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసేవారు. ఆయనపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వాహినీ స్టూడియోస్‌కు వచ్చేవారు. నా సినిమాలు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వచ్చి కూర్చుని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు" అని అన్నారు.
"జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం 'జై విఠలాచార్య'. తక్కువ బడ్జెట్, లొకేషన్‌లలో వేగంగా, పొదుపుగా ఎలా సినిమా తీయవచ్చనేది ఆయన చేసి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయనో పెద్ద బాలశిక్ష. కరోనా టైమ్‌లో విఠలాచార్యగారి శత జయంతి సందర్భంగా 'జై విఠలాచార్య' పుస్తకానికి అంకురార్పణ చేశాం. ఆయన ఎంత వేగంగా సినిమాలు తీసేవారో, అంతే వేగంగా పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా 9వ పుస్తకం ఇది" అని పులగం చిన్నారాయణ అన్నారు.
"కృష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ బుక్ ఫస్ట్‌లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. పులగం చిన్నారాయణగారు ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రాశారు. మూడుసార్లు నందులు అందుకున్నారు. ఆయన 9వ పుస్తకం ఇది. మరోసారి పురస్కారం అందుకుంటారని ఆశిస్తున్నాను" అని 'మూవీ వాల్యూమ్' షేక్ జిలాన్ బాషా అన్నారు.
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: ఆహా... బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్'కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!
Also Read: షన్నుకు సిరి లిప్ లాక్? వీళ్ల రిలేషన్ ఎక్కడికెళ్తోంది బిగ్‌బాస్? అసలు ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి