బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి నేటి ఉదయం తీరాన్ని దాటిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం రోజులుగా ఏపీ, తమిళనాడు ప్రాంతాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలతో ఏపీలో ముఖ్యంగా తిరుమల, తిరుపతిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడటంతో శ్రీవారి దర్శనాలకు సైతం అవాంతరాలు ఏర్పడ్డాయి. నేటి ఉదయం పరిస్థితి కాస్త మెరుగవడంతో ఓ మార్గంలో రాకపోకలకు టీటీడీ అనుమతి ఇచ్చింది.
ఏపీలో భారీ వర్షాలు.. తిరుపతి, తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి స్పందించారు. పరిస్థితులు తన మనసుసు కలచివేస్తున్నాయని, అంతా కలిసి పరిస్థితిని చక్కబెట్టాలని పిలుపునిచ్చారు. సాధ్యమైనంత త్వరగా తిరుమలలో స్థానికులు , భక్తులకు సాధారణ పరిస్థితి వచ్చేలా చేయడానికి తోడ్పాడు అందించాలని పిలుపునిచ్చారు.
Also Read: Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో కాలుపెడతా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్సాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయండి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నానంటూ’ చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read: Weather: తీరం దాటిన వాయుగుండం.. అయినా అప్రమత్తత అవసరం..
తీరాన్ని దాటినా అప్రమత్తత అవసరం..
వాయుగుండం తీరాన్ని దాటినా 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉండనుందని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలవిలయం సృష్టించింది. తిరుమల, తిరుపతిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. సీఎం జగన్ సైతం వర్షాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.