నటశేఖరుడికి తెలుగు ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. ఐదు దశాబ్దాల పాటు సాగిన నట ప్రయాణంలో 350కు పైగా సినిమాలు చేసి, ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ను కడసారి చూసేందుకు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా అభిమానులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గల పద్మాలయ స్టూడియోకు తరలి వచ్చారు. ఆయన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ మహాప్రస్థానంలో ముగిశాయి.


ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానానికి కృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. దారి పొడవునా ఆయనకు వేలాది సంఖ్యలో హాజరైన ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. 'కృష్ణ అమర్ రహే' అంటూ నినాదాలతో దారి అంతా మారుమ్రోగింది. మహాప్రస్థానం చేరిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రికి మహేష్ బాబు కొరివి పెట్టారు.
  
కుటుంబాన్ని, అభిమానులను, తెలుగు సినిమాను ఒంటరి చేస్తూ... ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కృష్ణ వెళ్లారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని నానక్‌రామ్ గూడాలోని విజయ నిర్మల నివాసానికి తీసుకు వెళ్లారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం నేటి ఉదయం వరకు అక్కడే ఉంచారు. ఈ రోజు(బుధవారం) ఉదయం విజయ నిర్మల నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తీసుకు వచ్చారు.
 
కృష్ణకు రాజకీయ నాయకుల నివాళి
కృష్ణ (Krishna Death) మరణ వార్త తెలియడంతో తెలుగు ముఖ్యమంత్రులు తమ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య నాయుడు తదితరులు కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇంకా హరీష్ రావు, సీపీఐ నారాయణ తదితరులు కృష్ణను కడసారి చూసి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్వీట్లు చేశారు. 


తెలుగు షూటింగులు బంద్!
కృష్ణ మరణించిన విషయం తెలిసిన వెంటనే పలు సినిమా షూటింగులు నిలిపి వేశారు. అవుట్ డోర్‌లో ఉండి లేదా షూటింగ్ క్యాన్సిల్ చేయడం వీలు కాని పరిస్థితుల మధ్య ఉన్న చిత్ర బృందాలు కృష్ణకు నివాళులు అర్పించి షూటింగ్ కొనసాగించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, మురళీ మోహన్, వెంకటేష్, కె. రాఘవేంద్రరావు, ఎంఎం కీరవాణి, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య అక్కినేని, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ తదితరులు కృష్ణకు నివాళులు అర్పించారు. మహేష్ బాబు, నమ్రత, సుధీర్ బాబు, మంజుల - కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.


Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ


కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు కొనియాడారు. తెలుగు సినిమాలో ఎన్నో ప్రయోగాలకు ఆయన ఆద్యుడు అని, తెలుగు సినిమా ఉన్నతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కృష్ణ మరణంతో తెలుగు సినిమాలో ఓ తరం ముగిసింది. తొలి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఇప్పుడు కృష్ణ... లోకాన్ని విడిచి వెళ్లారు. 


Also Read : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?