సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna), మురళి మోహన్ మధ్య స్నేహం సినిమా పరిశ్రమలో మొదలైనది కాదు. ఇండస్ట్రీలోకి రాక ముందు... కాలేజీ రోజుల నుంచి వాళ్ళిద్దరూ స్నేహితులు. ఏలూరులో కలిసి చదువుకున్నారు. సీఆర్ రెడ్డి కాలేజీలో క్లాస్‌మేట్స్! కృష్ణ మరణంతో అప్పటి రోజులను మురళీ మోహన్ (Murali Mohan) గుర్తు చేసుకున్నారు.
కృష్ణమూర్తి అని పిలిచే వాడిని!
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. కాలేజీలో ఆయనను 'కృష్ణ మూర్తి' అని పిలిచి వాడినని మురళి మోహన్ తెలిపారు. చదువు కోసం బుర్రిపాలెం నుంచి ఏలూరు వచ్చిన కృష్ణ హాస్టల్‌లో కాకుండా, రూమ్ తీసుకుని ఉండేవారని, కూర్చుని కబుర్లు చెప్పుకోవడం తమకు అలవాటు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి పండక్కి కృష్ణ తమ ఇంటికి వచ్చేవారన్నారు. తమది 66 ఏళ్ళ స్నేహమని, దాన్ని క్లుప్తంగా ఎలా చెప్పగలనని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్ ఫెయిలైన సూపర్ స్టార్, మురళి మోహన్!
కృష్ణ, తాను... ఇద్దరం ఫ్రంట్ బెంచ్‌లో కూర్చునే వాళ్ళమని మురళి మోహన్ చెప్పారు. కృష్ణకు సిగ్గు ఎక్కువని అన్నారు. అయితే... ఇంకో విషయం కూడా చెప్పారు. తామిద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యామని మురళి మోహన్ రివీల్ చేశారు. అయితే... అదే కాలేజీలో డిగ్రీ చేసే అవకాశం వచ్చిందన్నారు.
సినిమాల్లోకి వస్తున్నట్టు కృష్ణకు తెలియదు!
సినిమాలపై ఆసక్తితో కాలేజీ నుంచి కృష్ణ మద్రాసుకు వెళితే... వ్యాపారం చేయాలని మురళి మోహన్ కోయంబత్తూరు వెళ్ళారు. కోయంబత్తూరు నుంచి వచ్చేటప్పుడు చెన్నై వెళ్ళి స్నేహితుడి దగ్గర ఒక రోజు ఉండి వచ్చేవారు. ఆ క్రమంలో ఒకసారి 'చేసిన పాపం కాశీ పోయినా కూడా పోదు' నాటకంలో మురళి మోహన్ నటించారు. అయితే... సినిమాల్లోకి వస్తున్నట్లు స్నేహితుడికి చెప్పకుండా సర్‌ప్రైజ్ చేశారు.
''దాసరి నారాయణ రావు గారు దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ఓ సినిమాలో నేను అతిథి పాత్రలో నటించాను. సెట్స్‌కు వెళ్లిన తర్వాత 'నువ్వు ఏం చేస్తున్నావ్?' అని కృష్ణ అడిగారు. సినిమాలో చేస్తున్నాని చెప్పా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాం'' అని మురళి మోహన్ చెప్పారు.
Also Read : 'వండర్ ఉమెన్' రివ్యూ : అమ్మ కాబోయే మహిళలు, భర్తలు తప్పకుండా చూడాల్సిన సినిమా!
కృష్ణ, నాగార్జున హీరోగా 'వారసుడు' సినిమాను మురళీ మోహన్ నిర్మించారు. కృష్ణ తనయుడు మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ జయభేరి ఆర్ట్స్ సంస్థలో 'అతడు' సినిమా నిర్మించారు. కాలేజీలో మొదలైన వాళ్ళ స్నేహం కృష్ణ మరణం వరకు కొనసాగింది. స్నేహితుడి మృతి తనను ఎంతో బాధించిందని మురళి మోహన్ తెలిపారు. ఆయన కృష్ణ పాడె మోశారు.
నిర్మాతల మేలు కోరే వ్యక్తి
కృష్ణ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని మురళీ మోహన్ కొనియాడారు. ఆయన మనసు ఎంతో గొప్పదన్నారు. ఆయన నిర్మాతల హీరో అన్నారు. సినిమా పరాజయం పాలైతే.. నిర్మాతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారని చెప్పారు. వారితో మరో సినిమా ఉచితంగా చేసే వారని చెప్పారు. డబ్బులు లేవని నిర్మాతలు చెప్పినా.. మీరు మొదలు పెట్టండి, మిగతా విషయాలు తాను చూసుకుంటానని చెప్పేవారన్నారు. నిర్మాతల మేలు కోరే కృష్ణ లాంటి నటుడుని తాను ఇంత వరకు చూడలేదని మురళీ మోహన్ చెప్పారు.
Also Read : 'ఐరావతం' రివ్యూ : థ్రిల్స్ ఉన్నాయా? లేదంటే టార్చర్ చేశారా?